న్యూఢిల్లీలో ‘పితృస్వామ్యం వర్ధిల్లాలి’ అనే నినాదంతో జరిగిన ఓ నిరసన కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పురుషుల హక్కుల కోసం పనిచేస్తున్న ‘ఎన్‌సీఎం ఇండియా కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. పురుషులు, మహిళలకు సమానంగా వర్తించే చట్టాలు, పురుషుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లను ఈ సంస్థ ముందుకు తెచ్చినట్లు సమాచారం.
నిరసనలో ఏర్పాటు చేసిన బ్యానర్‌పై ‘‘పితృస్వామ్యం మహిళలు, పిల్లలు, వృద్ధులు, కుటుంబం, సమాజం, దేశాన్ని రక్షిస్తుంది’’ అనే సందేశం కనిపించింది. ఈ నినాదం, బ్యానర్‌లోని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు కారణమయ్యాయి. నిరసనకు సంబంధించిన ఓ వీడియోలో ఓ మహిళ మాట్లాడిన దృశ్యాలు కూడా వైరల్‌గా మారాయి. సమానత్వం పేరుతో కొందరు మహిళలు ఇంటి బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆమె అభిప్రాయపడినట్లు వీడియోలో కనిపించింది. కుటుంబాన్ని రక్షించే బాధ్యత పురుషులదేనని ఆమె పేర్కొంది.
ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు తీవ్రంగా విమర్శించగా, మరికొందరు సమానత్వం, కుటుంబ బాధ్యతలు, పురుషుల పాత్రపై చర్చకు దారితీసే అంశంగా దీనిని చూశారు. ఇదే సమయంలో ఢిల్లీలో మహిళల భద్రత, లైంగిక హింసకు వ్యతిరేకంగా మరోవైపు మహిళలు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పితృస్వామ్యం వర్ధిల్లాలి’ అనే నినాదంతో జరిగిన కార్యక్రమం లింగ సమానత్వం, మహిళల స్వేచ్ఛ, పురుషుల హక్కుల అంశాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది.


