
దాల్చిన చెక్క మిశ్రమంతో మంచి ఫలితాలు
పసుపు ఔషధ గుణాలపై ఐసీఎంఆర్ మోనోగ్రాఫ్
వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగయ్యే పసుపులో అద్భుత ఔషధ గుణాలున్నట్లు వివిధ సంస్థలు చేపట్టిన పరిశోధనల్లో మరోసారి రుజువైందని కేంద్రం తెలిపింది. పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే కీలక రసాయనానికి వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించే సత్తా ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. ఇండియన్ కౌన్సి ల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పసుపుపై మోనోగ్రాఫ్‌ను తయారు చేసిందని తెలిపింది. ఇందులో ఔషధ గుణాలు, బయోయాక్టివిటీస్, ఫైటోకెమికల్స్, దుష్ప్రభావాలు తదితర అంశాలను పొందుపరిచిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పసుపు–దాల్చినచెక్క మిశ్రమంతో డయాబెటిస్ పీడిత జంతువులపై జరిపిన ప్రయోగాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు కోజికోడ్‌లోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) వెల్లడించింది.
పసుపుతో ఎలాంటి దుష్ప్రభావం లేదు:
ఆయుర్వేదిక పరిశోధన మండలి ఆధ్వర్యంలో పసుపులో ఉండే 22 ఔషధ లక్షణాలకు సంబంధించిన 15 వ్యాధులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని తెలిపింది. ఇవి ప్రభావవంతంగా పనిచేసినట్లు తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అంతేగాక, పసుపు వల్ల కాలేయానికి హాని, రక్తం సరిగ్గా గడ్డకట్టకపోవడం వంటి ప్రభావాలపై జంతువులపై జరిపిన పరీక్షల్లో నెగిటివ్ ప్రభావాలు లేవని తేలిందని ఐఐఎస్‌ఆర్ తెలిపింది.
కర్క్యూమిన్ శాతం అధ్యయనం:
మరోవైపు ఫార్మకలాజికల్ ఉపయోగానికి సరైన కర్క్యూమిన్ శాతం ఉన్న పసుపు రకాలపై ఐసీఏఆర్ పరిశోధన చేసింది. ప్రతిభ, ప్రగతి, అలెప్పీ సుప్రీమ్, రోమా, రాజేంద్ర సోనియా వంటి రకాలలో 5 శాతం కంటే ఎక్కువగా కర్క్యూమిన్ ఉందని పేర్కొంది. ఈ రకాలను రైతులు అనేక రాష్ట్రాల్లో సాగుచేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని లకాడాంగ్, మహారాష్ట్రలో వైగాన్ టర్మెరిక్ రకాలూ అధిక కర్క్యూమిన్ శాతం కలిగి ఉన్నాయని వెల్లడించారు. కాగా, పిప్పలాద్యాసవం, హరిద్రాఖండం, కల్యాణకఘృతం, నల్పమరాది తైలం, నిసా–ఆమలకి చూర్ణం వంటి అనేక ఆయుర్వేద ఔషధాల్లో పసుపు ముఖ్యమైన పదార్థంగా వాడుతున్నట్లు ప్రకటించారు. మొత్తంగా, పసుపు ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలపై కేంద్రం విస్తృత పరిశోధనలు నిర్వహించిందనీ, తగిన సమాచారాన్ని సేకరించిందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ఇటీవల లోక్‌సభలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో వివరించారు.