Miss Koovagam 2022: హిజ్రాల అందాల పోటీలు.. సందడే సందడి

Transgenders: Miss Koovagam Competition In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: కూవాగం వైపుగా హిజ్రాలు తరలుతున్నారు. మిస్‌ కూవాగం పోటీలు హోరాహోరీగా మొదలయ్యాయి. మంగళవారం హిజ్రాల పెళ్లి సందడి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి  జిల్లా ఉలందూరు పేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువు దీరిన కూత్తాండవర్‌ హిజ్రాలకు ఆరాధ్యుడు అనే విషయం తెలిసిందే.  ఈ ఆలయంలో ఈనెల 6వ తేదీ నుంచి  చైత్రమాసం(చిత్తిరై) ఉత్సవాలు జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ ఉత్సవాలు జరగలేదు. అయితే, ఈ ఏడాది అనుమతి దక్కడంతో అత్యంత వేడుకగా జరుపుకునేందుకు హిజ్రాలు సిద్ధమయ్యారు.

చదవండి: పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురాయె!

తండోపతండాలుగా.. 
ఈ ఉత్సవాల్లో ముఖ్యఘట్టమైన హిజ్రాల పెళ్లి సందడి అత్యంత వేడుకగా మంగళవారం జరగనుంది. ఈ వేడుక కోసం హిజ్రాలు కూవాగం వైపుగా పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి సైతం ఇక్కడకు తరలి వస్తున్నారు. వీరి రాకతో విల్లుపురం, ఉలందూరు పేట పరిసరాల్లోని లాడ్జీలు, గెస్ట్‌ హౌస్‌లు కిటకిటలాడుతున్నాయి. అందగత్తెలకు తామేమీ తక్కువ కాదన్నట్లుగా సింగారించుకుని హిజ్రాలు రోడ్ల మీద ప్రత్యక్షం కావడంతో వారిని చూసేందుకు యువకులు ఎగబడుతున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ఉత్సవాల్లో భాగంగా హిజ్రాలకు ఫ్యాషన్‌ షో, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తొలిరోజు ఓ సంఘం నేతృత్వంలో మిస్‌ కూవాగం పోటీలు అర్ధరాత్రి వరకు నిర్వహించారు. మరో సంఘం నేతృత్వంలో సోమవారం అందాల పోటీలు, సాంస్కృతిక వేడుకలు చేపట్టనున్నారు. ఈ ఉత్సవాలపై చెన్నై హిజ్రాల సంఘం కన్వీనర్‌ సుధా మాట్లాడుతూ, డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం తమకు గుర్తింపు పెరిగిందన్నారు. తమకోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా, పథకాల్ని అందజేస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ తమకు ప్రాధాన్యతను ఇచ్చారని గుర్తు చేశా రు. అందుకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మంత్రి పొన్ముడి, ఎంపీలు తిరుచ్చి శివ, గౌతమ్‌ శిగామని, రవికుమార్, సినీ నటుడు సూరి, నళని వంటి వారు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నట్లు వెల్లడించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top