పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురాయె! | Bridegroom became Bride at Konakanamitla | Sakshi
Sakshi News home page

పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురాయె!

Apr 18 2022 4:43 AM | Updated on Apr 18 2022 12:46 PM

Bridegroom became Bride at Konakanamitla - Sakshi

పెళ్లి కూతురుగా ముస్తాబైన యోగేంద్రబాబు

కొనకనమిట్ల: పెళ్లిలో ఠీవీగా కనిపించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెగా దర్శనమిచ్చాడు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన నాలి రామయ్య కుమారుడు యోగేంద్రబాబుకు ఆదివారం రాత్రి వివాహం జరిగింది. పెళ్లి కుమారుడు తమ వంశాచారం ప్రకారం ప్యాంటు, చొక్కాలకు బదులుగా చీర, జాకెట్‌ ధరించి బారెడు విగ్గు, తలనిండా పూలు పెట్టుకున్నాడు. బొట్టూ, కాటుక, గాజులు, దండలతో అచ్చం పెళ్లి కుమార్తెలా ముస్తాబయ్యాడు. వంశాచారం ప్రకారం పెళ్లి ముందు దేవుడికి ఎదురు నడిచే తతంగం ఉంది.

అందులో భాగంగా తమ ఇలవేల్పు అయిన గురప్పడు స్వామికి కొలుపులు జరిపేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి మేళతాళాలు, బొల్లావుతో ఉత్సవం చేసుకుంటూ ఎదురైన ముత్తయిదువులకు నుదుట బొట్టు పెట్టుకుంటూ వారి ఆశీర్వచనాలు అందుకున్నాడు. ఊరి చివరి ఉన్న జమ్మిచెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఇది తమ వంశాచారమని పెళ్లికి ముందుగా పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెగా..పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడిగా అలంకరించి పూజలు చేస్తామని, అది తమ ఆనవాయితీ అని నాలి రామయ్య చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement