6 వారాల్లో 3 రైలు ప్రమాదాలు.. 17 మంది మృతి.. 100 మందికి గాయాలు | Train Accident Death Injured Railway Ministry | Sakshi
Sakshi News home page

6 వారాల్లో 3 రైలు ప్రమాదాలు.. 17 మంది మృతి.. 100 మందికి గాయాలు

Jul 30 2024 1:11 PM | Updated on Jul 30 2024 3:18 PM

Train Accident Death Injured Railway Ministry

ఒడిశా రైలు ప్రమాదం(2023) తర్వాత రైళ్లలో భద్రతకు సంబంధించిన అనుమానాలు ప్రజల్లో అలానే ఉన్నాయి. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 290 మంది మృతిచెందారు. ఈ ప్రమాదం తర్వాత కూడా దేశంలో పలు రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

తాజాగా జార్ఖండ్‌లోని బారాబంబో వద్ద హౌరా-ముంబై మెయిల్‌కు చెందిన 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గత ఆరు వారాల్లో మూడు ప్యాసింజర్ రైలు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో 17 మంది మృతి చెందారు. ఈ ప్రమాదాలన్నీ ఈ ఏడాది జూన్‌-జూలై మధ్య జరిగాయి. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గత నెల జూన్ 17న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 11 మంది మృతి చెందగా, 60 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

ఈ నెల జూలై 18న ఉత్తరప్రదేశ్‌లోని గోండా రైల్వే స్టేషన్‌ సమీపంలో చండీగఢ్-దిబ్రూగఢ్ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పడంతో నలుగురు మృతి చెందగా, 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. జూలై 30న హౌరా-ముంబై మెయిల్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు.

కాగా రైల్వే మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రైలు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2000-01లో మొత్తం 473 రైలు ప్రమాదాలు జరిగాయి. అది 2014-15 నాటికి 135కి తగ్గింది. అది 2022 నాటికి 48కి చేరింది. రైల్వే ప్రమాదాల దృష్ట్యా కవచ్‌ వ్యవస్థ అమలును ముమ్మరం చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement