రూ.35 కోట్లు విలువ చేసే విగ్రహం చోరి.. అమెరికాలో ప్రత్యక్షం!

TN Stakes Claim Over Rare Idol From Chola Period In US - Sakshi

తిరువొత్తియూరు: తంజావూర్‌లోని ఓ ఆలయంలో 50 సంవత్సరాల క్రితం చోరీ జరిగిన రూ.35 కోట్లు విలువ చేసే త్రిపుర సంహారమూర్తి విగ్రహం అమెరికాలో ఉన్నట్టు కనుగొన్నారు. తంజావూరు జిల్లా వరత్తనాడు సమీపం ముత్తమ్మాల్‌పురంలో కాశీ విశ్వనాథస్వామి ఆలయం ఉంది. 

ఇక్కడ 50 ఏళ్ల క్రితం 83.3 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన త్రిపుర సంహారమూర్తి పంచలోహ విగ్రహం చోరీ జరిగింది. ఈ విగ్రహం రూ.35 కోట్లు చేస్తుందని తెలిసింది. పైగా ఈ విగ్రహానికి బదులుగా అదే రూపంలో మరో విగ్రహం తయారు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో ఉంచినట్లు  సందేహం రావ డంతో ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారి సురేష్‌ ఈ విషయమై విగ్రహాల తరలింపు నిరోధక విభాగం పోలీసులకు 2020లో ఫిర్యాదు చేశాడు. దీంతో విగ్రహాల నిరోధక విభాగం కుంభకోణం ప్రత్యేక విభాగం డీఎస్పీ ముత్తు రాజ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. పుదువైలో వున్న ఫ్రెంచ్‌ సంస్థకు వెళ్లి అక్కడ ఆధారాలను నమోదు చేశారు. 

దీనికి సంబంధించిన ఫొటోలను ఇతర దేశాల్లో ఉన్న ఎగ్జిబిషన్‌లో చూస్తున్న సమయంలో తంజావూరులో చోరీకి గురైన త్రిపుర సంహారస్వామి పంచలోహ విగ్రహం అమెరికాలో ఎగ్జిబిషన్‌లో ఉన్నట్లు కనుగొన్నారు. దీనికి సంబంధించి అమెరికా నుంచి త్రిపుర సంహారమూర్తి విగ్రహాన్ని రాష్ట్రానికి తీసుకురావడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top