
పోలీసులే దొంగను నిద్రలేపారు
కర్ణాటక: అర్థరాత్రి వేళ ఇంటి చోరీకి వచ్చిన దొంగ ఆరవేసిన టవల్, పంచను చోరీ చేసి పక్కింటి మీద నిద్రించగా, మంగళవారం ఉదయం పోలీసులు అతనిని నిద్రలేపి ఠాణాకు తీసుకెళ్లారు. నవ్వు పుట్టించే ఈ తమాషా సంఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. వివరాలు.. నగర శివార్లలోని సోమినకొప్ప టీచర్స్ కాలనీలో కుమార్ అనే వ్యక్తి ఇంటి పై అంతస్తులోకి ఓ యువ దొంగ చొరబడ్డాడు. అక్కడ ఉన్న బీరువాను తెరిచి చూడగా అందులో ఏమీ దొరకలేదు.
టవల్, పంచ తదితర దుస్తులను తీసుకుని పక్కింటి మిద్దైపెన వాటిని పరచుకుని నిద్రించాడు. తెల్లవారగానే కుమార్ ఇంటి పైభాగంలో ఆరవేసిన దుస్తుల కోసం రాగా, గది తలుపులు, బీరువా తలుపులు తెరిచి ఉండటం గమనించి ఆశ్చర్యపోయాడు. పోలీసులకు సమాచారమిచ్చాడు, వెంటనే పోలీసులు వచ్చి చూడగా పక్కింటిపై నిద్రిస్తున్న దొంగ కనిపించాడు. వినోబానగర ఎస్‌ఐ సునీల్, సిబ్బంది ఆ దొంగను నిద్ర లేపి పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు.