పతంగులు ఎగురవేయడానికి రూ.20వేల నుంచి రూ.లక్షన్నర వరకు చార్జ్
సంప్రదాయ వంటకాల విందు, గాలి పటాలు అందిస్తున్న యజమానులు
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఇంటి పైకప్పులు కూడా కాసులు కురిపిస్తున్నాయి. సంక్రాంతి వేళ అక్కడి ఇంటి పైకప్పులకు డిమాండ్ పెరుగుతోంది. ఉత్తరాయణంలో భాగంగా 1989 నుంచి అహ్మదాబాద్‌లో అధికారికంగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వేడుకలను 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్స్‌లర్ ఫెడ్రిక్ మెర్జ్ కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. సుమారు 50 దేశాల నుంచి వెయ్యి మంది తమ గాలిపటాలతో ఇక్కడ వాలిపోయారు. ‘పద పదవే వయ్యారి గాలి పటమా’ అంటూ తమ ప్రతిభను చాటుకున్నారు.
పతంగుల పండుగకు మంచి పేరు రావడంతో అహ్మదాబాద్‌లో ఇప్పుడు ‘టెర్రస్ టూరిజం’ఊపందుకుంది. నాలుగైదేళ్లుగా పతంగులను ఎగురవేసేందుకు స్థానికులు తమ ఇంటి పై కప్పులను అద్దెకిస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఎంత ఎత్తైన ఇంటి పైకప్పు ఉంటే అంత ఎక్కువ డిమాండ్, అంత ఆదాయం. పోల్స్, ఖాడియా, రాయ్‌పూర్ ప్రాంతాల్లోని ఎత్తైన ఇళ్ల పైకప్పులు పండుగకు ముందే బుక్ అయ్యాయి. పైకప్పుల అద్దెలు రూ.20 వేల నుంచి రూ.లక్షన్నర వరకు పలుకుతున్నాయి. సాధారణంగా ఒక రోజు (24 గంటలు) అద్దె రూ.20–25 వేల వరకు ఉంటుంది. చివరి క్షణాల్లో అది లక్షల్లోకి చేరుతుంది. విదేశీయులే కాదు అక్కడ స్థిరపడిన స్థానికులు కూడా స్వస్థలాలకు చేరుకుంటారు. గాలి పటాలు ఎగురవేసి చెరిగిపోని పాత జ్ఞాపకాలను మూటగట్టుకుంటారు.
గాలిపటాలు.. వంటకాల విందు...
ఇళ్ల పైకప్పులపై గాలిపటాలే కాదు పసందైన గుజరాతీ సంప్రదాయ వంటకాల విందు కూడా అందిస్తున్నారు ఇంటి యజమానులు. అతిథులకు ఉంధియూ–పూరి, జిలేబీ, భజియా, నువ్వుల చిక్కీ, రుచికరమైన భోజనం వంటివి అందిస్తున్నారు. అంతేకాదు.. మినరల్ వాటర్, కూర్చోవడానికి సోఫాలు–కురీ్చలు, వృద్ధులు–పిల్లల విశ్రాంతి కోసం గదులు కూడా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెర్రస్ టూరిజం వల్ల ఇళ్ల యజమానులకే కాదు, పరిసరాల్లో చిన్న వ్యాపారులకూ మేలు జరుగుతోంది. ఈ పండుగ వేళ్లలో వారు ప్రతిరోజు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు సంపాదిస్తున్నారు.
సంస్కృతి కళ్లకు కట్టినట్లుగా...
హోటళ్ల కంటే స్థానిక ప్రాంతాల్లో ఉండడం వల్ల పండుగ వాతావరణాన్ని దగ్గరగా అనుభవించే అవకాశం ఉంటుంది. అలాగే.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. పాత హవేలీలు, ఒకదానితో ఒకటి కలిసిన పైకప్పుల కారణంగా ఆ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది. అందుకే టెర్రస్ టూరిజం ఇప్పుడు ట్రెండ్‌గా మారిందని స్థానికులు చెబుతున్నారు.


