
బీసీ రిజర్వేషన్లకు మోదీయే అడ్డుగోడ
అణగారిన వర్గాల కోసమే కాంగ్రెస్ పోరాటం
ఇది న్యాయం, సమానత్వం కోసం పోరు
కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక
సాక్షి, న్యూఢిల్లీ: ‘సబ్ కా సాత్ సబ్‌కా వికాస్’అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా డొల్ల అని, అణగారిన వర్గాల రిజర్వేషన్ల కోసమే తమ పోరాటమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. న్యాయం ఆలస్యం కావడమంటే, దాన్ని నిరాకరించడమేనని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరుతూ బుధవారం జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ ధర్నా పురస్కరించుకుని వారు ‘ఎక్స్’లో తమ అభిప్రాయాలను వెల్లడించారు.
సామాజిక న్యాయం కోసం తెలంగాణ సర్కారు కృషి: ఖర్గే
‘విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్ హక్కు కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఆమోదించింది. కానీ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో.. రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో మహాధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కుల సర్వే అనంతరం సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసే చర్య మా ప్రభుత్వం తీసుకుంది. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా డొల్ల. ఎందుకంటే ఈ బిల్లులకు, అణగారిన వర్గాల హక్కులకు మోదీయే అడ్డుగోడగా ఉన్నారు..’అని ఖర్గే ధ్వజమెత్తారు.
అణగారిన వర్గాల కోసమే ఈ పోరాటం: రాహుల్ గాంధీ
‘తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేశా యి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలని వారు డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం దిశగా ఈ బిల్లు ఒక పెద్ద ముందడుగు. మద్దతు ఇచ్చిన ‘ఇండియా’నేతలకు నా కృతజ్ఞతలు. రాష్ట్రపతి దీనిని గుర్తించి ఆమోదిస్తారని ఆశిస్తున్నా. ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసం మాత్రమే కాదు. దేశంలోని అణగారిన వర్గాలకు అధికారం, హక్కుల కోసం జరుపుతున్న సమిష్టి పోరాటం.’. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
చరిత్రాత్మక బిల్లు
‘తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక బిల్లు ఆమోదించింది. అయితే ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడే ఆగిపోయింది. ఇందుకు నిరసనగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. రాష్ట్రపతి తక్షణమే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం తెలంగాణ పోరాటమే కాదు. అణగారిన వర్గాలకు న్యాయం, సమానత్వం, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కోసం జాతి యావత్తు చేస్తున్న ఆందోళన. న్యాయాన్ని ఆలస్యం చేయడమంటే, దాన్ని తిరస్కరించడమే..’అని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు.