
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ సీఐడీ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా ఇవాళ తెలంగాణ సీఐడీ సంచలన ఆపరేషన్ చేపట్టింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు తెలంగాణ సీఐడీ, అడిషనల్ డీజీపీ చారు సిన్హా వెల్లడించారు. ఆరు బృందాలతో ఆపరేషన్ చేపట్టి 8 మంది ఆపరేటర్లను అరెస్టు చేశామన్నారు. Taj0077, Fairplay, Andhra365, Vlbook, Telugu365, Yes365 యాప్‌లను నిర్వహిస్తున్నట్లు గుర్తించామని ఆమె తెలిపారు.
ఈ యాప్‌ల ద్వారా అంతర్రాష్ట్ర స్థాయిలో భారీగా బెట్టింగ్ వ్యాపారం నడుస్తోందని సీఐడీ గుర్తించింది. దాడుల్లో పలు హార్డ్‌వేర్ పరికరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశామని సీఐడీ అధికారులు తెలిపారు. ప్రధాన సూత్రధారులు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలిందని.. మిగిలిన నిందితుల కోసం సిట్ ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.