
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకే బీజేపీ జిమ్మిక్కులు
విరుచుకుపడిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
పాట్నా: ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల ప్రయోగాలు పనిచేయడం లేదని తేలాక బీజేపీ ఇప్పుడు ఈసీని ప్రయోగిస్తోందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టడానికే ఈసీ ఈ ద్రోహానికి పాల్పడుతోందని విమర్శించారు. పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో తేజస్వి యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు.
ఎన్నికల సంఘం ఇలాగే ద్రోహం చేయాలని నిర్ణయించుకుంటే తాము ఎన్నికలను బహిష్కరించడానికి కూడా వెనుకాడబోమని మరోమారు స్పష్టం చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ఈసీ నిస్సంకోచంగా ప్రయత్నిస్తోంది. ప్రత్యర్థులను బెదిరించడానికి సీబీఐ, ఈడీ, ఆదాయపు ప్ను శాఖ వంటి ఏజెన్సీలన్నింటిని ప్రయోగించిన బీజేపీ.. ఇప్పుడు రాజ్యాంగ బద్ధమైన ఈసీని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది.
ఈ ఆటలో భాగంగా ఈసీ చాలామంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులను అందిస్తోంది. గతేడాది నేను విజయ్ కుమార్ సిన్హా కేసును బయటపెట్టాను. ఈ రోజు ముజఫర్‌పూర్ మేయర్ నిర్మలా దేవీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు’ అని తేజస్వి అన్నారు. ఇంత వివాదం నడస్తున్నా ఈసీ ఎప్పుడూ మీడియా ముందుకు రాకపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడరు, బీహార్ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడరు, చివరకు ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా వారినే అనుసరిస్తున్నట్లు అనిపిస్తోందని తేజస్వి వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోందన్నారు. ఆగస్టు 17న రోహ్తాస్ జిల్లాలో ప్రారంభమయ్యే ఓటర్ల హక్కు యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి వచ్చిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిఖూభాయ్ దల్సానియా బీహార్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడంపై తేజస్వి అభ్యంతరం వ్యక్తం చేశారు.