నేతల ఆట విడుపు.. కొడైకెనాల్‌లో తిష్ట

Tamil Nadu Leaders Leaves To Kodaikanal With Families - Sakshi

కొడైకెనాల్‌లో నేతల తిష్ట

జీన్స్‌, ట్రాక్‌, టీ షర్టుల్లో ప్రత్యక్షం

సాక్షి, చెన్నై: తెల్ల పంచె, తెల్లచొక్క అంటూ రాజకీయ వ్యవహారాల్లో బిజీబిజీగా గడిపిన నేతలకు కాస్త విరామం లభించింది. కొడైకెనాల్‌లో పలువురు నేతలు ఆటవిడుపుగా తిష్ట వేశారు. కొందరు అయితే, కుటుంబాలతో కలిసి పర్యాటక కేంద్రాల్లో చక్కర్లు కొడుతున్నారు. వీరు తమ నాయకులేనా అని గుర్తు పట్టలేని రీతిలో వేషాల్ని మార్చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందుగా సిట్టింగ్‌ సీట్లు మళ్లీ దక్కేనా అన్న ఆందోళన అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పడ్డ విషయం తెలిసిందే. చివరకు సీట్లు దక్కించుకున్న వాళ్లు, ఎన్నికల ప్రచారంలో రేయింబవళ్లు ఓటర్లను ఆకర్షించేందుకు కుస్తీలు పట్టారు. పార్టీల ముఖ్య నేతలు, మంత్రులు అంటూ నెలన్నర రోజులు తీవ్రంగానే శ్రమించారు.

ఈనెల ఆరవ తేదీతో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఫలితాల వెల్లడికి మే 2వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం విరామ సమయం నేతలకు దొరికింది. తమ కుటుంబాలతో గడిపేందుకు మరింతగా సమయం దొరికింది. సీఎం పళనిస్వామి అయితే, స్వగ్రామం ఎడపాడికి వెళ్లి కుటుంబం, బంధువులతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతోంది. డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం సొంతూరు బోడినాయకనూర్‌కు పరిమితమయ్యారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అయితే, కుటుంబంతో కలిసి కొడైకెనాల్‌ వెళ్లారు.  

వేషాల్ని మార్చేసి.. 
తమిళ నేతలు సాధారణంగా తెల్లపంచె, తెల్ల చొక్కాలతో దర్శనం ఇవ్వడం నిత్యం చూస్తూ వచ్చాం. అయితే, ఇప్పుడు విరామ సమయంలో తమ వేషాల్నే మార్చేశారు. భార్య దుర్గ, కుమారుడు ఉదయ నిధి, కోడలు, మనుమళ్లు, మనుమరాళ్లతో స్టాలిన్‌ కొడైకెనాల్‌లో రెండు రోజులుగా బస చేశారు. గోల్ఫ్‌ ఆడుతూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. సాయంత్రం సతీమణితో కలిసి అలా పర్యాటక అందాల్ని తిలకించేందుకు కారులో చక్కర్లు కొట్టే పనిలో పడ్డారు. ట్రాక్, టీషర్టుతో కనిపించిన స్టాలిన్‌తో సెల్ఫీలకు పలువురు ఎగబడడం విశేషం. ఈ పరిస్థితుల్లో కొడైకెనాల్‌లో స్టాలినే కాదు, అన్నాడీఎంకే ముఖ్య నేతలు, మంత్రులు పలువురు సైతం కుటుంబాలతో కలిసి తిష్ట వేసి ఉండడం వెలుగు చూసింది. అయితే, వీళ్లేనా తమ నేతలు, తమ మంత్రులు అని గుర్తు పట్టలేని పరిస్థితుల్లో వేషాల్ని మార్చేశారు.

థర్మాకోల్‌ మంత్రిగా ముద్ర పడ్డ సహకార మంత్రి సెల్లూరురాజు ఆదివారం ఉదయం కుటుంబంతో వాకింగ్‌ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఆయన్ను తొలుత ఎవ్వరూ గుర్తు పట్టనప్పటికీ, చివరకు దగ్గరకు వెళ్లి పలకరించగా, ఆయనే సెల్లూరు రాజు అని తేలింది. దీంతో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పలువురు యువకులు ఆసక్తి చూపించారు. తానే కాదు, మరెందరో నేతలు కొడైకెనాల్‌లో విశ్రాంతిలో ఉన్నట్టుగా సెల్లూరు సంకేతం ఇవ్వడం గమనార్హం. పంచెకట్టు, తెల్ల చొక్కాల్ని పక్కన పెట్టి, టీషర్టులు, జీన్స్‌లు, ట్రాక్‌లతో వేషాల్ని మార్చిన మనోల్ని గుర్తు పట్టడం కాస్త కష్టమే అన్నట్టుగా పరిస్థితి నెలకొని ఉండడం గమనార్హం. గతంలో ముఖ్య నేతలు ఎన్నికల అనంతరం విదేశాలకు చెక్కేసేవారు. తాజాగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌కు పరిమితమైనట్టుంది. 

చదవండి: రాత్రి కర్ఫ్యూ.. ఆదివారం ఫుల్‌ లాక్‌డౌన్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top