రాత్రి కర్ఫ్యూ.. ఆదివారం ఫుల్‌ లాక్‌డౌన్‌, వర్క్‌ఫ్రం హోంకు ఆదేశాలు

Covid 19 2nd Wave Tamilnadu Government Announces Night Curfew - Sakshi

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆదివారం ఫుల్‌ లాక్‌డౌన్‌ 

ప్లస్‌ టూ పరీక్షల వాయిదా 

నేటి అర్ధరాత్రి నుంచి 30 వరకు అమలు

వర్క్‌ ఫ్రం హోమ్‌కు ఆదేశాలు  

రాష్ట్రంలో కరోనా కట్టడి లక్ష్యంగా రాత్రి కర్ఫ్యూకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఫుల్‌ లాక్‌డౌన్‌ అమలు కానుంది. ప్లస్‌టూ పరీక్షలు, పోలీసు, విద్యుత్‌ బోర్డు పరీక్షలన్నీ వాయిదా వేశారు. ప్రైవేటు సంస్థలు యాభై శాతం ఉద్యోగులతో వర్క్‌ ఫ్రం హోమ్‌ చేపట్టే రీతిలో ఆదేశాలు జారీ అయ్యాయి. 

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ప్రప్రథమంగా ఆదివారం 10 వేల 723 పాజిటివ్‌లు, 42 మరణాలు చోటుచేసుకున్నాయి. రెండు వారాల్లో మూడింతల మేరకు కేసులు పెరగడంతో నిబంధనల్ని కఠినం చేయకతప్పలేదు. అయినా, ప్రజల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించడం, నిబంధనలు తుంగలో తొక్కేవారు అధికంగా ఉండడంతో ఆంక్షల కఠినంకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం ఉదయం గ్రీన్‌వేస్‌ రోడ్డులోని నివాసంలో సీఎం పళనిస్వామి అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌రంజన్, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, డీజీపీ త్రిపాఠి, అధికారులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. గంటన్నర పాటు సాగిన ఈ భేటీ తర్వాత సాయంత్రం ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన చేసింది.  

రాత్రి కర్ఫ్యూ.. 
బహిరంగ ప్రదేశాలు, వేడుకలు, సమావేశాలు, సభల్లో ప్రజలు నిబంధనల్ని పాటించడం లేదని, సరైన మార్గదర్శకాలను అనుసరించడం లేదని పేర్కొంటూ, రెండు వారాల్లో ఏ మేరకు కేసుల సంఖ్య పెరిగిందో ఆ ప్రకటనలో వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రాత్రి పది గంటల నుంచి వేకువ జామున నాలుగు గంటల వరకు నైట్‌కర్ఫ్యూ విధించారు. ఈ సమయాల్లో అత్యవసర సేవల వాహనాలు, అంబులెన్స్, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లకు వెళ్లడం కోసం అద్దె, వ్యక్తిగత వాహనాలు, పాలు, పత్రికలు, సరకుల సరఫరా వాహనాలు మినహా తక్కిన, అన్ని రకాల వాహన సేవలకు అనుమతి లేదని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మధ్య కూడా వాహన సేవలు ఉండవని స్పష్టం చేశారు.

ఆ తర్వాత సమయాల్లో కరోనా నిబంధనలకు అనుగుణంగా వాహన సేవలకు అనుమతి కల్పించారు. పెట్రోల్, డీజిల్‌ బంక్‌లకు రాత్రుల్లోనూ అనుమతి ఇచ్చారు. రాత్రుల్లో ప్రైవేటు పరిశ్రమలు, అత్యవసర పరికరాల తయారీ పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది, వాచ్‌మన్‌లు, సెక్యూరిటీలు విధులకు వెళ్లే సమయంలో గుర్తింపు కార్డులు లేదా అనుమతి లేఖ తప్పనిసరిగా కల్గి ఉండాలని ఆదేశించారు. ప్రైవేటుసంస్థలు, ఐటీ సంస్థలు 50 శాతం సిబ్బందితో వర్క్‌ ఫ్రం హోమ్‌పై దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తూ, మాంసం, చేపలు, కూరగాయలు, సినిమా థియేటర్లు, వాణిజ్య సమూదాయాలు అంటూ అన్ని సేవలు నిలుపుదల చేయనున్నారు. అయితే, అత్యవసర, మీడియా, పాలు సేవలకు అనుమతి ఇచ్చారు.  

30 వరకు అమలు 
హోటళ్లల్లో పార్సిల్స్‌ సేవలకు సమయం కేటాయించడమే కాకుండా, టాస్మాక్‌  దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, వస్త్ర దుకాణాలన్నీ రాత్రి 9 గంటలకే మూసివేయాలని ప్రకటించారు. స్విగ్గి, జొమాటో ఆన్‌లైన్‌ వర్తక సేవలకు సమయం కేటాయించారు. అన్ని రోజుల్లో వివాహ కార్యక్రమల్లో 100 మంది మించకుండా, అంత్యక్రియల కార్యక్రమాల్లో 50 మంది మించకుండా ఉండే రీతిలో చర్యలు తీసుకున్నారు. నీలగిరి, కొడైకెనాల్, ఏర్కాడు, ఊటీ సహా పర్యాటక కేంద్రాలు, బీచ్‌ల వైపు, పార్కులు, వినోద కేంద్రాలు, ఎగ్జిబిషన్లు అన్నీ మూసివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వీటికి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి అనుమతి లేదు. ముందుగా నిర్ణయించిన వేడుకలు, సమావేశాలు, ఉత్సవాలకు నిర్వాహకులు, 50 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

అదే విధంగా ప్లస్‌టూ పరీక్షలు, పోలీసు శరీర దారుఢ్య పరీక్షలు, విద్యుత్‌ బోర్డు పరీక్షలన్నీ వాయిదా వేశారు. అయితే, ప్లస్‌టూ ప్రాక్టికల్స్‌ కొనసాగుతాయని ప్రకటించారు. విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఆన్‌లైన్‌ తరగతులు, ఆన్‌లైన పరీక్షల నిర్వహణకు అవకాశం ఇచ్చారు. వేసవి శిక్షణకు అనుమతి రద్దు చేశారు. కరోనా పాజిటివ్‌ కేసుల పెరుగుల దృష్ట్యా, ప్రైవేటు వసతి గృహాలు, లాడ్జీలు, హోటళ్లు, రిసార్టులను క్వారంటైన్లుగా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. అయితే, ఇందుకు ఆరోగ్య శాఖ అనుమతి తప్పనిసరి చేశారు. సినిమా థియేటర్లలో 50 శాతం మందికి మాత్రమే అనుమతిని తప్పనిసరిగా అనుసరించాలని, లేని పక్షంలో సీజ్‌ చేస్తామని హెచ్చరికలు జారీ అయ్యాయి.  

చెన్నైలో కోవిడ్‌ కంట్రోల్‌ రూం 
సాక్షి, చెన్నై: చెన్నైలోని 15 మండలాల్లోని ప్రజలకు కరోనా వైద్య, చికిత్సా సేవల నిమిత్తం ప్రత్యేకంగా కోవిడ్‌ కంట్రోల్‌రూం ఆదివారం ఏర్పాటైంది. 12,600 పడకలతో కేర్‌ సెంటర్లు సిద్ధం చేసినట్టు కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రకాష్‌ వెల్లడించారు. రాష్ట్రంలోనే చెన్నైలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 3,304 కేసులు చెన్నైలో నమోదయ్యాయి. ఇక్కడ కేసుల పెరుగుదలతో కార్పొరేషన్‌ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇంటింటా ఫీవర్‌ టెస్టులు, పరీక్షల్లో వెలుగు చూసే కేసుల లక్షణాలను బట్టి వారికి చికిత్స అందించడం, హోం క్వారంటైన్‌ సేవలపై దృష్టి పెడుతూ నగరంలో 12 చోట్ల స్క్రీనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. పాజిటివ్‌ రోగి తొలుత ఈ సెంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది.

రోగి వ్యాధి తీవ్రత, లక్షణాలను బట్టి చికిత్సలపై ఈ సెంటర్లలో దృష్టి పెడతారు. అలాగే, కరోనా సమాచారం, అత్యవసర సేవలు, కరోనా బారినపడి హోం క్వారంటైన్లలో ఉన్న వారు సేవలను పొందేందుకు ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంను ఆదివారం ఏర్పాటు చేశారు. 044–46122300, 25384520 నంబర్లను ఇందుకోసం కేటాయించారు. ఈ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేస్తే, తమకు కావాల్సిన సేవలు కరోనా బాధితులకు, వారి కుటుంబాలకు అందుతాయని కమిషనర్‌ ప్రకాష్‌ ప్రకటించారు.  వీడియో మెడికల్‌ యాప్‌ ఏర్పాటు చేశామని, దీని ద్వారా ఇళ్లల్లో ఉన్న వారికి మనో ధైర్యాన్ని కల్పించడమే కాకుండా, వైద్యపరంగా సహకారం అందించేందుకు డాక్టర్లు సిద్ధంగా ఉంటారని వివరించారు. 

టెలీ కౌన్సిలింగ్‌.. 
ఈ కంట్రోల్‌ రూమ్‌లో టెలీ కౌన్సిలింగ్‌ సదుపాయం, సైక్లాజికల్‌ సపోర్టింగ్‌ టీంను నియమించామని, మూడు షిఫ్ట్‌లుగా 150 మంది ఇక్కడ సేవల్ని అందిస్తారని వివరించారు. ఈ కంట్రోల్‌ రూం సేవలు చెన్నైలోని 15 మండలాల్లో ఉన్న 200 వార్డుల్లోని ప్రజలకు మాత్రమే వర్తిస్తాయని తెలిపారు. కరోనా టీకాకు వ్యతిరేకంగా ఎవరైనా ఆరోపణలు, ప్రచారాలు చేసిన పక్షంలో కేసులు తప్పవని హెచ్చరించారు. సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌పై డీజీపీకి ఫిర్యాదు వెళ్లిందని, కేసు సైతం నమోదైనట్టు తెలిపారు. చెన్నైలో 12,600 పడకలతో ప్రత్యేక కోవిడ్‌ కేర్‌ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రస్తుతం 1,104 మంది ఇక్కడ చికిత్సలో ఉన్నట్టు తెలిపారు. సినీ నటుడు అధర్వ కరోనా బారినపడ్డారు.  

వ్యాక్సిన్‌ కోసం స్టాలిన్‌ లేఖ ... 
రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ముందుకు వస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో పలు చోట్ల కరోనా వ్యాక్సిన్, కోవిషీల్డ్‌లకు కొరత తప్పడం లేదు. రాష్ట్రం విజ్ఞప్తి మేరకు 20 లక్షల టీకాలను త్వరితగతిన పంపించాలని, రాష్ట్రాలే టీకాను  కొనుగోలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఆదివారం లేఖ రాశారు. ఆదివారం కోయంబేడు మార్కెట్‌ను మూసివేయడంతో ఆ పరిసరాలు నిర్మానుష్యం అయ్యాయి. తిరునల్వేలిలోని మహేంద్రగిరి ఇస్రో కేంద్రంలో పనిచేస్తున్న వారిలో 47 మంది ఆదివారం కరోనా బారినపడ్డారు.

ఈరోడ్‌ జిల్లా మెడకురిచ్చిలోని ఓ ప్రైవేటు సంస్థలో వంద మేరకు సిబ్బంది కరోనా బారినపడడంతో ఆ పరిసరాల్లో వైరస్‌ కట్టడి నిమిత్తం గ్రామాల్లో ఉన్న దుకాణాలన్నీ నాలుగు రోజులు స్వచ్ఛందంగా మూసి వేస్తూ వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 12 ఏళ్లలోపు పిల్లలు రెండు వేల మంది వైరస్‌ బారిన పడడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. కేసుల పెరుగుదలతో దక్షిణ రైల్వే సైతం సిద్ధమైంది. అత్యవసర సేవల నిమిత్తం బోగీలను ప్రత్యేక పడకల కోవిడ్‌ సెంటర్లుగా సిద్ధం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్‌ అయ్యాయి. 

చదవండి: వ్యాక్సిన్‌కు, వివేక్‌ మృతికి సంబంధం లేదు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top