
పర్యాటకుల ఆకర్షణలో నంబర్ వన్
మంత్రముగ్ధులవుతున్న స్వదేశీ, విదేశీ సందర్శకులు
తాజ్ తర్వాత విదేశీ పర్యాటకుల ఆకర్షణలో ఆగ్రాకోటకు రెండో స్థానం
స్వదేశీ పర్యాటకుల ఆకర్షణలో కోణార్క్ సూర్యదేవాలయానికి ద్వితీయం
2024–25 కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడి
ఆ ఏడాది భారత్‌కు వచ్చిన విదేశీ పర్యాటకులు 99.51 లక్షల మంది
టాప్–15 దేశాల నుంచి వచ్చిన 76.70 లక్షల మంది
సాక్షి, అమరావతి: తాజ్‌మహల్ అనగానే ప్రేమకు చిహ్నమైన అపురూప కట్టడం మదిలో మెదులుతుంది. ఈ చారిత్రక అద్భుతాన్ని చూసి అబ్బురపడని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల మనసు దోచింది తాజ్ మహల్. కేంద్ర పర్యాటక శాఖ 2024–25 సంవత్సరాలకు విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ ఏడాది స్వదేశీ, విదేశీ పర్యాటకుల ఆకర్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఆగ్రా పోర్టు రెండో స్థానంలో నిలవగా స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో కోణార్క్ సూర్య దేవాలయం రెండో స్థానంలో నిలిచింది.
2024–25లో తాజ్‌మహల్‌ను 6.45 లక్షల విదేశీ పర్యాటకులు సందర్శించగా స్వదేశీ పర్యాటకులు 62.64 లక్షల మంది సందర్శించారు. కోణార్క్ సూర్య దేవాలయాన్ని 35.71 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు సందర్శించారు. ఆగ్రా కోటను 2.24 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. 2024–25లో దేశానికి మొత్తం 95,51,722 మంది విదేశీ పర్యాటకులు వచ్చినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా టాప్ 15 దేశాల నుంచే 76.70 లక్షల మంది విదేశీ పర్యాటకులు దేశానికి వచ్చినట్లు పేర్కొంది.
అత్యధికంగా అమెరికా నుంచి తరువాత బంగ్లాదేశ్ నుంచి విదేశీ పర్యాటకులు వచ్చినట్లు గణాంకాలు తెలిపాయి. అంతకు ముందు ఆరి్థక ఏడాదితో పోలిస్తే 2024–25లో విదేశీ పర్యాటకుల సంఖ్య 4.30 లక్షలు పెరిగారు. 2024–25లో భారత దేశానికి 99.51 లక్షల విదేశీ పర్యాటకులు రాకతో రోజూ సగటున 27,000 కంటే ఎక్కువ మంది దేశానికి వచ్చారు.
6.45 లక్షలు 2024-25లో తాజ్ మహల్‌ను సందర్శించిన విదేశీ పర్యాటకులు
62.64 లక్షలు 2024 -25లో సందర్శించిన స్వదేశీ పర్యాటకులు
2.24 లక్షలు 2024-25లో ఆగ్రాకోటను తిలకించిన విదేశీ పర్యాటకులు
35.71 లక్షలు 2024-25లో కోణార్క్ సూర్య దేవాలయానికి వచ్చిన స్వదేశీ పర్యాటకులు

