‘దొంగల ఇంటి పేరు మోదీ’ వ్యాఖ్యలపై... రాహుల్‌కు రెండేళ్ల జైలు

Surat court sentences Rahul Gandhi to two years in jail - Sakshi

పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన సూరత్‌ కోర్టు

అప్పీల్‌కు అనుమతి, నెలపాటు శిక్ష నిలిపివేత 

ఇప్పటికిప్పుడు అనర్హత  వేటు పడదు: నిపుణులు

సూరత్‌/ఢిల్లీ: ‘దొంగలందరి ఇంటిపేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీకి గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద రాహుల్‌ను దోషిగా చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హెచ్‌.హెచ్‌.వర్మ నిర్ధారించారు. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన అనంతరం బెయిల్‌ మంజూరు చేశారు. పై కోర్టులో అప్పీలుకు వీలుగా జైలు శిక్షను 30 రోజులపాటు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు.

తీర్పు వెలువరించిన సమయంలో రాహుల్‌ కోర్టులోనే ఉన్నారు. ‘‘ఈ కేసులో దోషి పార్లమెంట్‌ సభ్యుడు. ఆయన ఏం మాట్లాడినా అది దేశ ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే కేసు తీవ్రత పెరిగింది. దోషికి తక్కువ శిక్ష విధిస్తే ప్రజలకు తప్పుడు సంకేతం పంపించినట్లు అవుతుంది. ఎవరైనా ఇతరులను ఇష్టారాజ్యంగా దూషించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో రాహుల్‌ గతంలో క్షమాపణ చెప్పారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆయనకు సూచించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు’’ అని న్యాయస్థానంలో తన తీర్పులో పేర్కొంది.

కించపర్చే ఉద్దేశం లేదు
విచారణ సందర్భంగా రాహుల్‌ తన వాదన వినిపించారు. తనకు ఎవరిపైనా ఎలాంటి వివక్ష లేదని, దేశ ప్రజలందరినీ అభిమానిస్తానని చెప్పారు. ఎవరినీ కించపర్చే ఉద్దేశం లేదన్నారు. ‘‘ప్రజాప్రయోజనాల కోణంలోనే ఎన్నికల ప్రచారంలో ప్రసంగించా. అది నా విధి’’ అని తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, నిందితుడు గతంలో ఏ కేసులోనూ దోషిగా తేలలేదని, ఎవరి నుంచీ క్షమాభిక్ష కోరలేదని, ఆయనకు తక్కువ శిక్ష విధించాలని రాహుల్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనను ప్రాసిక్యూషన్‌ తరపు న్యాయవాది ఖండించారు. రాహుల్‌ను గతంలో సుప్రీంకోర్టు మందలించిందని గుర్తుచేశారు. ప్రాసిక్యూషన్‌ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.

చట్టప్రకారం పోరాడతాం: కాంగ్రెస్‌  
సూరత్‌ కోర్టు తీర్టుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అప్పీల్‌ దాఖలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘‘పిరికిపంద, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం రాహుల్‌ గాంధీపై, ప్రతిపక్షాలపై కక్షగట్టింది. ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నిస్తున్నందుకు, అదానీపై అంశంపై జేపీసీ నియమించాలని డిమాండ్‌ చేస్తున్నందుకు మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటోంది. రాజకీయ ప్రసంగాలపై కేసులు పెట్టడం చాలా దారుణం. ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే నాలుగు వేళ్లు తమవైపే చూపిస్తాయని బీజేపీ నేతలు తెలుసుకోవాలి. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించాం. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. చట్ట ప్రకారమే పోరాడుతాం’’ అని ఖర్గే స్పష్టం చేశారు.  

రాహుల్‌ భయపడే ప్రసక్తే లేదు: ప్రియాంక
తన సోదరుడు రాహుల్‌ గొంతును నొక్కేయడానికి మోదీ ప్రభుత్వం సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తోందని కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ వాద్రా మండిపడ్డారు. రాహుల్‌ గతంలో ఏనాడూ భయపడలేదని, భవిష్యత్తులోనూ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సత్యమే మాట్లాడుతాడని ట్వీట్‌ చేశారు. దేశ ప్రజల కోసం గొంతెత్తుతూనే ఉంటారని పేర్కొన్నారు.

రాహుల్‌కు కేజ్రీవాల్‌ మద్దతు  
రాహుల్‌ను పరువు నష్టం కేసులో ఇరికించడం దారుణమని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. బీజేపీయేతర నాయకులు, పార్టీలపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ట్వీట్‌ చేశారు. వారిని కేసుల్లో ఇరికించడం ద్వారా నిర్మూలించడమే ఉద్దేశమన్నారు.

సత్యమే నా మార్గం: రాహుల్‌
సూరత్‌ కోర్టు తీర్పుపై రాహుల్‌ గాంధీ స్పందిం చారు. ‘‘సత్యం, అహింసపైనే నా మతం ఆధారపడి ఉంటుంది. సత్యమే నా దైవం. ఆ దైవాన్ని చేరుకొనే మార్గమే అహింస’’ అంటూ మహాత్మాగాంధీ చెప్పిన సూక్తిని ట్వీట్‌ చేశారు. స్వాతంత్య్ర యోధులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించారు. సత్యం, ధైర్యసాహసాలే ఆలంబనగా మాతృదేశం కోసం నిర్భయంగా పోరాడడాన్ని ఆ మహనీయుల నుంచి నేర్చుకున్నామన్నారు.
 
క్షమాపణ చెప్పాలి: బీజేపీ  
రాహుల్‌ గాంధీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేïపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఇతరులను దూషిస్తే శిక్ష తప్పదని చెప్పారు. రాహుల్‌కు జైలుశిక్ష విధించడంపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఎవరినైనా దూషించడానికి రాహుల్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందా? అని ప్రశ్నించారు. ఇతరుల పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడినందుకు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ డిమాండ్‌ చేశారు.  

అమిత్‌ షాకు సమన్లు ఇవ్వండి
సీబీఐ డైరెక్టర్‌కు జైరాం రమేశ్‌ లేఖ   
న్యూఢిల్లీ: ‘‘మేఘాలయలో కాన్రాడ్‌ సంగ్మా సర్కారు దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సమన్లు జారీ చేయండి. అవినీతికి సబంధించిన వివరాలు ఆయన నుంచి సేకరించండి’’ అని సీబీఐని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఈ మేరకు సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ జైస్వాల్‌కు లేఖ రాశారు. ‘‘సంగ్మా ప్రభుత్వ అవినీతి గురించి తెలిసే షా ఆరోపణలు చేశారు. దానిపై చర్యల నిమిత్తం వివరాలు సేకరించండి’’ అని కోరారు.

ఏమిటీ కేసు?
2019 ఏప్రిల్‌ 13న కర్నాటకలోని కోలార్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్‌ ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పించారు. ‘దొంగలందరి ఇంటి పేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అని అన్నారు. మోదీ సామాజికవర్గం పరువుకు రాహుల్‌ నష్టం కలిగించారంటూ గుజరాత్‌లోని సూరత్‌ వెస్ట్‌ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేశ్‌ మోదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్‌ విజ్ఞప్తి మేరకు విచారణ సూరత్‌లో జరగకుండా విధించిన స్టేను గుజరాత్‌ హైకోర్టు గత ఫిబ్రవరిలో తొలగించింది.

అనర్హత వేటు పడుతుందా? 
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన రాజకీయ నాయకుడిపై శిక్ష ఖరారైన తేదీ నుంచి మిగిలిన పదవీ కాలమంతా అనర్హత వేటు పడుతుంది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడు. అయితే, అనర్హత వేటు వెంటనే పడదని సుప్రీంకోర్టు లాయర్‌ మహేష్‌ జెఠ్మలానీ చెప్పారు. ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం మూడు నెలల గడువు ఇవ్వొచ్చని తెలిపారు. ఈ సమయంలో నేరారోపణ లేదా శిక్షపై అప్పిలేట్‌ కోర్టు స్టే ఇస్తే అప్పీల్‌పై విచారణ ముగిసే దాకా అనర్హత వేటు కూడా ఆగిపోతుందని వివరించారు. మూడు నెలల్లోగా నేరారోపణ లేదా శిక్ష రద్దు కాకపోతే దోషిపై అనర్హత వేటు వేయొచ్చని పేర్కొన్నారు.

శిక్షను రద్దు చేసే అధికారం శిక్ష విధించిన కోర్టుకు కాకుండా అప్పిలేట్‌ కోర్టుకే ఉంటుందన్నారు. రాహుల్‌ గాంధీకి విధించిన జైలు శిక్షను అప్పిలేట్‌ కోర్టు రద్దు చేయొచ్చని, అదే జరిగితే అప్పీల్‌పై విచారణ ముగిసేదాకా ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసే అవకాశం లేదని మహేష్‌ జెఠ్మలానీ వెల్లడించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే శిక్షను అప్పిలేట్‌ కోర్టు రద్దు చేయడమో లేదంటే నేరారోపణపై స్టే విధించడమో జరగాలని సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది చెప్పారు. రాహుల్‌ గాంధీకి అప్పిలేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. 2013 నాటి లిలీ థామస్, 2018 నాటి లోక్‌ ప్రహరి కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఆయన గుర్తుచేశారు. ప్రజాప్రతినిధుల శిక్ష రద్దయితే అనర్హత వేటు కూడా రద్దవుతుందని అప్పట్లో న్యాయస్థానం తేల్చిచెప్పిందని వివరించారు.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top