మరాఠాలు వెనుకబడిన వర్గం కాదు

Supreme Court told Marathas socially and politically dominant - Sakshi

వారు సామాజికంగా, రాజకీయంగా ప్రభావశీల వర్గం

రాజకీయ హామీలు రాజ్యాంగ బద్ధం కాదు

‘ఇందిరాసాహ్ని’తీర్పు పునఃపరిశీలన అవసరం లేదు 

మరాఠాల రిజర్వేషన్ల కేసులో పిటిషనర్ల వాదన

సాక్షి, న్యూఢిల్లీ:  మహారాష్ట్రలో మరాఠాలు సామాజికంగా, రాజకీయంగా ప్రభావశీల వర్గమని సీనియర్‌ న్యాయవాది ప్రదీప్‌ సంచేటి సుప్రీంకోర్టుకు తెలిపారు. మహారాష్ట్రలోని ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఆ వర్గం వారే 40% వరకు ఉంటారన్నారు. రాష్ట్రంలోని అధిక శాతం భూములు వారి ఆధీనంలోనే ఉన్నాయన్నారు. ‘వారు వెనుకబడిన వారు, వారికి అన్యాయం జరిగింది అనే వాదనలోనే తప్పు ఉంది’అన్నారు. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు రాజీవ్‌ ధావన్, ప్రదీప్‌ సంచేటి వాదనలు వినిపించారు.

మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించే అంశాన్ని కూడా ఈ కేసు విచారణలో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారని, ప్రభుత్వ సర్వీసుల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేదని 2018లో ఎంజీ గైక్వాడ్‌ ఇచ్చిన నివేదికను కూడా న్యాయవాది సంచేటి తప్పుబట్టారు. అది రాజకీయ కారణాలతో కావాలనే రూపొందించిన నివేదికలా ఉందన్నారు. ‘ఒకవేళ మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించినా.. అది రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు నిర్ధారించిన 50% పరిమితిలోపే ఉండాలి’అని స్పష్టం చేశారు. ఇందిరా సాహ్ని కేసు తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు.. 50% పరిమితిని మించి మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అసాధారణ పరిస్థితులేవీ లేవని వాదించారు.

వివిధ వర్గాలను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చే విషయంలో గణనీయ స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయని మరో న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ పేర్కొన్నారు. ఓటర్లకు రాజకీయ నేతలు ఇచ్చిన హామీలు రాజ్యాంగబద్ధం కాదన్నారు. సామాజిక, రాజకీయ ఒత్తిళ్లనేవి సామాజిక స్థితిగతుల్లో మార్పులుగా పరిగణించలేమన్నారు. రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం అందరికీ సమాన అవకాశాలు లభించే పరిస్థితిని కల్పించడమేనన్నారు. ఇదే విషయాన్ని నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ చెప్పారన్నారు. పోరాడే సామర్ధ్యం అందరికీ ఒకేలా లభించేలా చూడాలని అమర్త్యసేన్‌ వివరించారన్నారు. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలన్న వాదనను ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా, ఈ కేసు విషయంలో కేంద్రం స్పందన తెలియజేయాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం ఆదేశించింది. వాదనల అనంతరం జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ హేమంత్‌గుప్తా, జస్టిస్‌ రవీంద్రభట్‌లు కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఆధార్‌ లింక్‌ లేదని 3 కోట్ల రేషన్‌ కార్డులు రద్దు!
ఇది చాలా తీవ్రమైన అంశం: సుప్రీం
ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయలేదన్న కారణంతో దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా రేషన్‌ కార్డులను రద్దు చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించాలని సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సమాధానమివ్వాలని ఆదేశిస్తూ 4 వారాలు గడువు ఇచ్చింది. ఆధార్‌తో లింకప్‌ చేయలేదన్న కారణంతో 3 కోట్లకుపైగా రేషన్‌ కార్డులు రద్దు చేశారని, దీంతో నిత్యావసరాలు లభించక ఆకలి చావులు సంభవించాయని జార్ఖండ్‌కు చెందిన కొయిలి దేవి అనే మహిళ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రతీ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల రేషన్‌ కార్డులు రద్దయ్యాయని పిటిషనర్‌ తరఫు లాయర్‌ గోన్‌సాల్వెస్‌ తెలిపారు. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అమన్‌ ఈ పిటిషన్‌ను వ్యతిరేకించారు.

ఆధార్‌ కార్డు లేకపోయినంత మాత్రాన ఆహార హక్కుని వదులుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ పిటిషన్‌ను ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో విచారణ జరగాలని తొలుత సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ‘ఈ తరహా పిటిషన్లు నేను బొంబే హైకోర్టులో ఉండగా విచారణ జరిపాను. దీనిని  ఆయా రాష్ట్రాల హైకోర్టులే చూడాలి’అని చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే అన్నారు. లింకేజీతోపాటు ఆహార భద్రత అంశాన్నీ చూడాలని లాయర్‌ గోన్‌సాల్వేస్‌ వాదించారు. దీంతో సుప్రీం బెంచ్‌ తానే ఈ పిటిషన్‌ను నాలుగు వారాల తర్వాత పూర్తి స్థాయిలో విచారిస్తానని çస్పష్టం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. పిటిషనర్‌ కొయిలిదేవి తన రేషన్‌ కార్డుని ఆధార్‌తో లింకప్‌ చేయకపోవడంతో రద్దయింది. నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడంతో తినడానికి తిండి లేక 11 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తె సరిత రెండేళ్ల క్రితం ఆకలి తట్టుకోలేక మరణించిందన్న వార్తలు వచ్చాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top