
బిహార్ ఎలక్టోరల్ రోల్‌పై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
తుది జాబితా నుంచి 3.66 లక్షల పేర్లు తొలగించినట్లు ఈసీ వెల్లడి
9వ తేదీలోగా పూర్తి వివరాలివ్వాలని కోర్టు సూచన
న్యూఢిల్లీ: బిహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పూర్తి వివరాలను తమకు అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశించింది. బిహార్‌లో ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది. ఎస్‌ఐఆర్ తర్వాత సెప్టెంబర్ 30న ప్రచురించిన తుది ఎలక్టోరల్ జాబితా నుంచి తొలగించిన వారి వివరాలు ఇవ్వాలని కోరింది.
ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది విచారణకు హాజరయ్యారు. తొలగించిన పేర్లలో చాలావరకు కొత్తగా ఓటు నమోదుచేసుకున్నవారేనని తెలిపారు. వారిలో ఎవరి నుంచీ ఫిర్యాదులు రాలేదని చెప్పారు. అయినప్పటికీ తొలగించినవారి పూర్తి వివరాలు తమకు అందజేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఎలక్టోరల్ ముసాయిదాతోపాటు తుదిజాబితాను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
గందరగోళాన్ని తొలగించేందుకే..
తమ ఆదేశాలు ఎన్నికల వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకొస్తాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఎన్నికల జాబితాపై గందరగోళాన్ని తొలగించేందుకే ఈ నిర్ణయమని తెలిపారు. ‘ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజలకు మరింత సమాచారం అందుబాటులో ఉండేందుకు మీరు (ఈసీ) మా నిర్ణయంతో ఏకీభవించాలి. మీరు ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితా నుంచి 65 లక్షల పేర్లు తొలగించారు. చనిపోయినవారు, రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించటం సబబే. కానీ, మీరు ఓటరు జాబితా నుంచి ఒక పేరును తొలగించాలంటే కచి్చతంగా రూల్ 21ను పాటించాలి. ప్రజలకు కూడా ఒక విన్నపం. ఎవరి పేర్లయితే ఓటర్ జాబితా నుంచి తొలగించబడిందో.. వారు తమ వివరాలను ఎన్నికల కార్యాలయాల్లో అందజేయండి’అని సూచించారు.