
న్యూఢిల్లీ: ముంబై రైళ్లలో పేలుళ్ల కేసులో ఇటీవలే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును గురువారం అత్యున్నత న్యాయస్థానం నిలిపేసింది. ప్రభుత్వ పిటిషన్‌పై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
నిర్దోషులుగా విడుదలైన 12 మందిని తిరిగి అరెస్ట్ చేయాలని చెప్పలేమంది. ‘ఈ కేసులో ప్రతివాదులందరినీ విడుదల చేశారు. మళ్లీ వారిని జైలుకు తీసుకొచ్చే ప్రశ్నే లేదు. అయితే, ఈ అభ్యంతరకరమైన తీర్పును మరే ఇతర కేసులలోనూ ఉదాహరణగా పరిగణించరాదు. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద ఉన్న ఇతర కేసులను హైకోర్టు తీర్పు ప్రభావితం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొనడంతో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 189 మంది ప్రాణాలు తీసిన 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో 12 మంది దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారించింది.
ముంబై పేలుళ్ల కేసు.. టైం లైన్
2006 జూలై 11న ముంబై వెస్ట్రన్ రైల్వే లైన్‌లో 7 రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగాయి.
ఈ దాడుల్లో 189 మంది మరణించగా, 827 మంది గాయపడ్డారు.
2015లో ప్రత్యేక కోర్టు 5 మందికి మరణశిక్ష, 7 మందికి జీవిత ఖైదు విధించింది.
జూలై 21, 2025.. హైకోర్టు విచారణలో ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది అని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చంద్రక్ పేర్కొన్నారు.
కన్ఫెషన్ స్టేట్మెంట్లు, సాక్షుల వాంగ్మూలాలు, గుర్తింపు పరేడ్ వంటి ఆధారాలు నమ్మదగినవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది.
తీర్పు ప్రకారం, వారు ఇతర కేసుల్లో అవసరం లేకపోతే వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
జులై 24.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే