ఆర్టికల్ 142 అదే చెబుతోంది: ఒడిశా మాజీ సీజే జస్టిస్ మురళీధర్
హైబ్రిడ్ విధానం ఆశించదగిన శుభపరిణామం
జడ్జీలకు క్షేత్రస్థాయి వాస్తవికతపై అవగాహన అవసరం... జడ్జీలు రాజకీయాల్లోకి రావడంపై లోతైన చర్చ జరగాలి
లిటరరీ ఫెస్టివల్ చర్చలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు అసాధారణ అధికారాలను ఇచ్చిందని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ పేర్కొన్నారు. తన ముందు పెండింగ్‌లోని ఏదైనా కేసులో సంపూర్ణ న్యాయం అందించేందుకు అవసరమైన ఏ ఉత్తర్వునైనా జారీ చేసే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి ఉందన్నారు. అయోధ్య వివాదం, భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులతోపాటు విడాకుల కేసుల్లో న్యాయస్థానం దీన్ని వినియోగించుకుందని చెప్పారు.
కొన్ని సందర్భాల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో న్యాయవ్యవస్థ విఫలమైందంటూ అయోధ్య కేసును ప్రస్తావించారు. నేరం బహిరంగంగా జరిగినా బాధ్యత నిర్ధారణ, శిక్ష విధింపులో తీవ్రమైన జాప్యం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. న్యాయం చేయడమే కాదు, న్యాయ ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాల్సిన బాధ్యత కూడా కోర్టులపై ఉందన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సెంటర్‌లో జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో ఆయన ‘(అ)సంపూర్ణ న్యాయం? 75 ఏళ్ల సుప్రీంకోర్టు’అనే పుస్తకంపై మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో ‘సుప్రీం’పాత్రను చెబుతుంది..
రాజ్యాంగం అమల్లోకి వచి్చన 75 ఏళ్ల సందర్భంగా సుప్రీంకోర్టు పనితీరు, పాత్ర, సవాళ్లను ఇందులో ప్రస్తావించినట్లు జస్టిస్ మురళీధర్ చెప్పారు. పలు కేసుల విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తన రాజ్యాంగ బాధ్యతలను ఎంత సమర్థవంతంగా నిర్వర్తించిందో తెలియజేయడానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రముఖుల వ్యాసాలు, ఇంటర్వ్యూలను ఈ పుస్తకంలో పొందుపర్చినట్లు చెప్పారు.
తీర్పుల ప్రస్తావనతోపాటు కొన్నిసార్లు అవసరమైన చర్య తీసుకోవడంలో విఫలమైందా.. లేదా.. అన్న సున్నిత విమర్శలు, ప్రశ్నలు కూడా ఇందులో ఉంటాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కోర్టు ప్రభావమే కాకుండా న్యాయ నియామకాల్లాంటి అంతర్గత, పరిపాలనా సవాళ్లను కూడా ఇందులోని వ్యాసాలు ప్రతిబింబిస్తాయన్నారు. సాయినాథ్, ప్రొఫెసర్ బక్షి, ప్రముఖ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, మీనాక్షి ఆరోరా లాంటి వారి రచనలను ఆయన ప్రస్తావించారు.
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు
న్యాయ విద్యలో సమూల మార్పు రావాల్సి ఉందని జస్టిస్ మురళీధర్ చెప్పారు. జాతీయ స్థాయి విద్యాసంస్థలున్నా.. నాణ్యమైన వాదనలు వినిపించే నిపుణులైన న్యాయవాదులను అందించడం లేదన్నారు. సుదీర్ఘమైన వాదనలతో కాకుండా నాణ్యమైన వాదనలతో కోర్టు సమయం వృథా కాదని, సత్వర న్యాయానికి దోహదం చేస్తుందన్నారు. యువ న్యాయవాదులు దీన్ని అలవర్చుకోవాలన్నారు.
హైబ్రిడ్ విచారణలు ఆశించదగిన పరిణామమని చెప్పారు. కొన్నిసార్లు బెంచ్‌ల మధ్య తీర్పుల్లో వ్యత్యాసం ఉండొచ్చంటూ తాజా ‘ఆరావళి’తీర్పును గుర్తుచేశారు. తీర్పులు నల్లేరుపై నడక కాదని, అయోధ్య, శబరిమల.. లాంటి కేసుల విచారణ సందర్భంగా న్యాయవ్యవస్థ రాజకీయ, సామాజిక ఒత్తిళ్లకు లోనైందన్నారు.
న్యాయమూర్తులు స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి వెళ్లి విహరించలేరని, అయినా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కిందిస్థాయి కోర్టుల్లోనైనా స్థానిక భాషల్లో విచారణ కొనసాగాలని, కక్షిదారులకు తమ కేసు వివరాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. జడ్జిలు రాజకీయాల్లో చేరడంపై లోతైన చర్చ అవసరమన్నారు.
న్యాయ సంస్కరణలు అవసరం
ఎలక్రో్టరల్ బాండ్లు, నోట్ల మారి్పడి, ఆర్టికల్ 370, పెగాసస్ స్పైవేర్.. లాంటి కేసుల విచారణలో సుప్రీంకోర్టు అనుసరించిన తీరు సరికాదని జస్టిస్ మురళీధర్ అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు ఆలస్య తీర్పు కారణంగా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. వేగవంతమైన విచారణ, బెయిల్ మంజూరు అంశాలను ప్రస్తావించిన ఆయన ట్రయల్ సత్వరం పూర్తి చేయాలని, దీని కోసం న్యాయ సంస్కరణలు తేవాలని నొక్కిచెప్పారు.
సీరియస్, నాన్–సీరియస్ కేసులుగా విభజించుకుని కీలకమైనవి కాకుంటే వెంటనే తీర్పులివ్వాలన్నారు. అవినీతి అనేది అన్ని వ్యవస్థల్లో మాదిరి న్యాయ వ్యవస్థలోనూ ఉందని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ప్రత్యేక చట్టం చేయాలని సూచించారు. 1984లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మురళీధర్ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు మారారు. 2006లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021లో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2023లో పదవీ విరమణ చేశారు.


