రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ
ఏ నిబంధన ప్రకారం ఆక్రమించుకున్న భూమి క్రమబద్దీకరణకు అనుమతిస్తున్నారు?
ఆ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలి
ప్రభుత్వాలు జమీందారీ సంస్థలు కావు.. ప్రజాస్వామ్య విధానాలు, చట్టాలకు లోబడి ప్రభుత్వాలు పని చేయాలి
ఈ వ్యవహారంలో అధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది
బొగ్గు కుంభకోణం, 2జీ స్పెక్ట్రం తీర్పుల ప్రకారం బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారు
ఈ కేసులోనూ అధికారులు, రాజకీయ నేతలపై చర్యలు తీసుకునే అవకాశం
కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి
ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ
కేంద్ర దర్యాప్తు సంస్థలకూ లేఖ పంపనున్నట్లు వెల్లడి
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రూరల్ మండలం రుషికొండ, ఎండాడ గ్రామాల్లో అత్యంత విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి ఉదారంగా సమర్పించడం చట్ట విరుద్ధమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి ఈఏఎస్ శర్మ స్పష్టంచేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని తెలిపారు. ఈ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, బాధ్యులైన అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మికి వేర్వేరుగా లేఖలు రాశారు.
పేదల గుడిసెలు తొలగించి.. పెద్దలు ఆక్రమించిన భూములు క్రమబద్ధీకరిస్తారా?
అదే అధికారులు విశాఖ నగరానికి జీవనోపాధి కోసం వలస వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిని, వీధి వ్యాపారుల బళ్లను పోలీసు బలగాల సహాయంతో పొక్లెయిన్లు తీసుకువచ్చి నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం, నిస్సహాయులకు మరొక న్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు.
గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిని ఈ నెల 30న జరిగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో క్రమబద్దీకరణ చేయడానికి చూస్తున్నారని పత్రికల్లో వార్తలు చూశానని తెలిపారు. ఈ విషయంలో విశాఖ రూరల్ మండలం తహసీల్దారు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రెవెన్యూ అధికారులు ఏ నియమం కింద ఇటువంటి క్రమబద్దీకరణకు అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ నిబంధనల్లో బీఎస్‌వో (బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్)24 కింద గానీ, రెవెన్యూ శాఖ 2012 సెప్టెంబర్ 14న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 571 కింద గానీ ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని వివరించారు.
ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే..
స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించకూడదని సుప్రీంకోర్టు జగపాల్ సింగ్ (కేస్ నంబర్ 1132/2011) కేసులో 2011 జనవరి 28న అన్ని రాష్ట్రాలను ఆదేశించినట్లు ఈఏఎస్ శర్మ ఆ లేఖలో స్పష్టంచేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లేనని తెలిపారు.
రిజిస్ట్రేషన్ శాఖ భూముల ధరల ప్రకారమే రుషికొండ, ఎండాడ ప్రాంతంలో ఎకరం రూ.22 కోట్లు ఉందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అంత విలువైన భూమిని లాభాలు గడించే ప్రైవేటు సంస్థకు కేటాయిస్తే, సుప్రీంకోర్టు 2జీ స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఆ నిర్ణయాలకు సహకరించిన అధికారులు, రాజకీయ నాయకుల మీద 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
అసైన్డ్ భూములను గీతం కొనుగోలు చేసింది
గతంలో గీతం సంస్థ రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాకుండా పేదలకు కేటాయించిన డీ పట్టా భూములను కూడా చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేసిందని శర్మ తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి ఆ ప్రైవేటు సంస్థల మీద చర్యలు తీసుకుని ఆ కొనుగోళ్లను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిందారీ సంస్థలు కావని అవి ప్రజాస్వామ్య విధానాలు, చట్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తాను సూచించిన అంశాలపై దర్యాప్తు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై రాజకీయ ఒత్తిడి ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలన్నారు. అందుకే ఈ లేఖను కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా పంపుతున్నట్లు ఆయన తెలిపారు.


