
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో బెయిలివ్వాలంటే ఏడాదిపాటు జైలులో గడపాలన్న నిబంధనేదీ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రూ.2 వేల కోట్ల లిక్కర్ కుంభకోణంలో గతేడాది ఆగస్ట్‌లో అరెస్టయిన వ్యాపారవేత్త అన్వర్ ధెబార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లో ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్బంగా ధెబార్ అరెస్టయి ఏడాది కూడా కాలేదని, ఆయనకు బెయిలివ్వరాదని ఈడీ న్యాయవాది వాదించారు. వివిధ కేసుల్లో బెయిల్ మంజూరుకు అత్యున్నత న్యాయస్థానం ‘ఏడాది కస్టడీ బెంచ్‌మార్క్’ను అనుసరిస్తోందని, ఈ కేసులోనూ దీనినే కొలమానంగా తీసుకోవాలని అన్నారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన ధెబర్‌ను విడుదల చేస్తే దర్యాప్తు ఆటంకం కలగొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో, ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది.
‘మొత్తం ఈ కేసులోని 450 మంది సాక్షులకు గాను ఇప్పటి వరకు 40 మంది విచారణ మాత్రమే పూర్తయింది. విచారణ సమీప భవిష్యత్తులో ముగిసే సూచనలు కనిపించడం లేదు. దర్యాప్తు పురోగతిలో ఉంది. గరిష్ట శిక్షాకాలం ఏడేళ్లు కాగా ఇప్పటికి 9 నెలలపాటు పిటిషనర్ జైల్లో ఉన్నారు’అని ధర్మాసనం పేర్కొంది. అయితే, ప్రత్యేక కోర్టు పేర్కొనే కఠిన షరతులు, నిబంధనలకు లోబడి ధెబర్‌ను వారం రోజుల్లో బెయిల్‌పై విడుదల చేయాలని దిగువ కోర్టుకు ఉత్తర్వులిచ్చింది పాస్‌పోర్టును అధికారులకు అప్పగించాలని అన్వర్ ధెబార్‌ను ఆదేశించింది.