మత విద్వేష ప్రసంగాలు.. చర్యలు తీసుకుంటారా? కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొంటారా?

Supreme Court To Government On Hate Speech Serve Notices - Sakshi

న్యూఢిల్లీ: మత విద్వేష పూరిత ప్రసంగాలపై సుప్రీం కోర్టు కొరడా ఝుళిపించింది. రాజ్యాంగ ప్రకారం భారత్‌ లౌకిక దేశమని ఎవరైనా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే ఫిర్యాదుల కోసం ఎదురు చూడకుండా నేరస్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇటీవల కాలంలో విద్వేష ప్రసంగాలు ఎక్కువగా వస్తున్న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఆదేశాలిచ్చింది. 

మత విద్వేషాలు వెళ్లగక్కే వారిపై చర్యలు తీసుకోవడానికి పరిపాలనాపరమైన జాప్యం చేస్తే కఠిన చర్యలుంటాయని, అది కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని ఆ మూడు రాష్ట్రాలకు గట్టి హెచ్చరికలు పంపింది. విద్వేషపూరిత ప్రసంగాలపై జర్నలిస్టు షాహీన్‌ అబ్దుల్లా వేసిన పిటిషన్‌ విచారించిన జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌ శుక్రవారం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ‘‘ఇది 21వ శతాబ్దం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ (ప్రాథమిక విధులు) శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలని మనకి చెబుతోంది. మరి మనం మతం పేరుతో ఎక్కడికి చేరుకుంటున్నాం. మతాన్ని ఎంత వరకు దిగజారుస్తున్నాం. నిజంగా ఇదొక విషాదం’’ అని జస్టిస్‌ జోసెఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘మతపరంగా తటస్ఠంగా ఉండే దేశంలో మతవిద్వేషకులు చేసే వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి’’ అని అన్నారు. వారి వారి మతాలతో సంబంధం లేకుండా విద్వేషపూరిత ప్రసంగాలు ఎవరు చేసినా చర్యలు తీసుకొని మన దేశ లౌకిక తత్వాన్ని కాపాడాలని సుప్రీం కోర్టు హితవు పలికింది. ‘‘భారత రాజ్యాంగం మనది లౌకిక దేశమని, పౌరులందరూ సహోదరులని చెప్పింది. వారి వారి మర్యాద, గౌరవాలకు భంగం వాటిల్లదని హామీ ఇచ్చింది. ఐక్యత, సమగ్రత అన్నవే మనల్ని ముందుకు నడిపించేవి. పరమత సహనం పాటించకుండా రెండు వేర్వేరు మతాలకు చెందిన వారి మధ్య సహోదర భావం ఏర్పడలేదు’’ అని కోర్టు పేర్కొంది.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఇటీవల కాలంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎలాంటి ప్రసంగాలు చేశారో, వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా ఎలా వదిలేసిందో ఉదాహరణలతో సహా పిటిషనర్‌ తరఫున వాదించిన సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల జరిగిన హిందూ సభలో బీజేపీ నేతలు ఎంతటి విద్వేషాన్ని వెళ్లగొట్టారో వివరించారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాపాడడం కోసమే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: మత ప్రాముఖ్య స్థలాలపై నిర్లక్ష్యం చేశారు-ప్రధాని మోదీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top