
న్యూఢిల్లీ: బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ‘మేము పిటిషనర్ తరఫు వాదనలు విన్నాం. ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్)గా దాఖలైన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము.
పిటిషనర్ కావాలంటే ఎన్నికల సంఘం ముందు తన అభ్యర్థనను ఉంచవచ్చు’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగీ్చతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం తమ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడానికి గడువు విధించాలని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది రోహిత్ పాండే చేసిన అభ్యర్థనను సైతం ధర్మాసనం త్రోసిపుచి్చంది. ఇలాంటి సందర్భాల్లో తగిన న్యాయ మార్గాలను అనుసరించవచ్చని సుప్రీం సూచించింది.