'గతంలో ఏ ల్యాండ్‌మైన్‌ ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేది'

Sucharittha Comments After Meeting With 10 Naxal Hit States - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ హోం మంత్రి సుచరిత 'సాక్షి టీవీ'తో మాట్లాడారు. 'గతంలో 5 జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది. ఇప్పుడు కేవలం రెండు జిల్లాలకే పరిమితమైంది. వారి సంఖ్యాబలం 50కి పడిపోయింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. మనబడి నాడు-నేడు పథకం ద్వారా మౌళిక సదుపాయాలు పెంచాం. అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15వేలు సహాయం చేస్తున్నాం. మహిళలకు సాధికారత కోసం రూ. 75 వేలు సహాయం చేస్తున్నాం. ఈ పథకాలన్నీ ఆర్థికంగా స్థిరపడేందుకు తోడ్పడుతున్నాయి. పేదరిక నిర్మూలనకు ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయి. సచివాలయ వ్యవస్థ ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం.

అటవీ ప్రాంతాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌కి తరలించాలని కోరాం. మారుమూల ప్రాంతాలలో మూడు కిలోమీటర్లకు ఒక పోస్టాఫీస్ ఉండాలని కోరా. 4జీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కోరా. ఈ కార్యకలాపాల వల్ల నక్సల్స్ ప్రాబల్యం తగ్గుతుంది. గతంలో ఎప్పుడు ఏ ల్యాండ్ మెయిన్ పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేది. ఏజెన్సీలో పర్యటించాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏజెన్సీలో రాజకీయ నేతలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఈ సమస్య పూర్తిగా తొలగిపోలేదు. అందుకే ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తతతో ఉంది.

చదవండి: (సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌: 539 కొత్త 104 వాహనాలు)

మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ పెంచాలని కోరాము. రోడ్లు వేసేందుకు ఉన్న ప్రతిబంధకాలను తొలగించి అనుమతివ్వాలని కోరా. అటవీ ప్రాంతాలలో టెలికాం, మౌళిక వసతులు సౌకర్యాలు పెంచాలని కోరాం. విభజన చట్టం మేరకు సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. బాక్సైట్ తవ్వకాలను ఆపేసిన నేపథ్యంలో, అవసరమైన ఖనిజాలను ఒరిస్సా నుంచి ఇవ్వాలి' అని కోరినట్లు మంత్రి సుచరిత తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top