రియల్టీ: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

Special story on The country real estate sector after coronavirus - Sakshi

దేశవ్యాప్తంగా ఆశావహంగా రియల్టీ

ముందు కరోనా, తర్వాత యుద్ధం

అయినా పుంజుకుంటున్న వైనం

కరోనాతో కుదేలైన దేశ రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటోందా? రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావాన్ని కూడా అధిగమించి పురోగమిస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవునని చెప్పవచ్చు. అలాగే కాదని కూడా! ఏళ్లుగా ఆగిన నిర్మాణాలు మళ్లీ గాడిన పడటం శుభ సూచకమైతే కొత్త వెంచర్లకు పెద్దగా డిమాండ్‌ లేకపోవడం, పూర్తయిన వాటిల్లోనూ అమ్మకాలు మందగతిన సాగుతూండటం ఇబ్బంది పెట్టే అంశం! అయితే కరోనా బారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో త్వరలో అన్నీ సర్దుకుంటాయన్న ఆశాభావం కనిపిస్తోంది.

కంచర్ల యాదగిరిరెడ్డి
దేశ ఆర్థిక వ్యవస్థ చురుకుదనానికి, పురోగతికి ప్రధాన సూచికల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఒకటి. అది పురోగమిస్తోందంటే స్టీలు, సిమెంటు వంటి కీలక పరిశ్రమలూ వృద్ధి బాటలో ఉన్నట్టే. కూలీలు, మేస్త్రీలు, అనుబంధ వృత్తుల వారికి భారీగా ఉపాధి లభిస్తుంది కూడా. దేశం మొత్తమ్మీద సుమారు ఏడు కోట్ల మందికి రియల్‌ ఎస్టేట్‌ ఉపాధి కల్పిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ రంగం ద్వారా 2018లో 7.6 కోట్ల మందికి ఉపాధి లభిస్తే తర్వాత క్రమేపీ తగ్గుదల నమోదైంది. 2019లో 6.21 కోట్లకు పరిమితమైంది. 2020లో కరోనా, లాక్‌డౌన్‌ తదితర కారణాలతో 21 లక్షల మందికి పని లేకుండా పోయింది. గతేడాది రియల్టీ ఉపాధి 5.37 కోట్లకు తగ్గింది!

ఏడు నగరాలు, రూ.4.48 లక్షల కోట్లు!

ఈ ఏడాది మే ఆఖరు నాటికి దేశం మొత్తమ్మీద ఏడు ప్రధాన నగరాల్లో 4.8 లక్షల యూనిట్ల నిర్మాణం స్తంభించిపోయి ఉంది. వీటి విలువ రూ.4.48 లక్షల కోట్లు. 2021 ఆగస్టు నుంచి ఈ మే దాకా దేశవ్యాప్తంగా 1.49 లక్షల యూనిట్ల నిర్మాణం పూర్తయింది. వీటిలో లక్షకు పైగా యూనిట్లు ఎన్‌సీఆర్, ముంబై మెట్రో రీజియన్లలోవే! 15,570 యూనిట్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది.

అయ్యో హైదరాబాద్‌
మిగతా ప్రాంతాల్లో రియల్టీ పుంజుకుంటున్న సంకేతాలుంటే హైదరాబాద్‌లో మాత్రం అంత సానుకూల పరిస్థితులు లేకపోవడం విశేషం. బడా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు హంగూఆర్భాటాలతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నా కొనుగోలుదారుల నుంచి స్పందన లేదు. ‘‘మేమెప్పుడు కొత్త ప్రాజెక్టు ప్రారంభించినా రోజుకు సగటున పది నుంచి 12 ఫ్లాట్లు బుక్కయేవి. కానీ ఇప్పుడు వారమంతా కలిపి పది బుకింగులే గగనంగా ఉంది’’ అని నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎండీ అన్నారు. కొత్త ప్రాజెక్టు ప్రకటన ఇచ్చిన వెంటనే రోజుకు 25 నుంచి 30 బుకింగ్‌లు చేసే వాళ్లమని, ఇప్పుడు నెలంతా కలిపినా అన్ని చేయలేకపోతున్నామని మరో ప్రముఖ కంపెనీ వర్గాలు వాపోయాయి.

మంచి శకునములే...
గతేడాది చివరి వరకూ రెండు, మూడో దశల కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న భారత్‌ ఈ ఏడాదే కాస్త తెరిపిన పడింది. రియల్టీ రంగంలోనూ ఇదే ధోరణి కన్పిస్తోంది. 2014, అంతకుముందే మొదలై పలు కారణాలతో 5.17 కోట్ల యూనిట్ల (అపార్ట్‌మెంట్లు/విల్లాల) నిర్మాణాలు ఆగిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ గత ఐదు నెలల్లోనే వీటిల్లో 37 వేల యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకుని అమ్మకాలకు సిద్ధమవడం మారిన పరిస్థితికి సూచికగా నిలుస్తోంది.

పూర్తయిన యూనిట్లలో  45 శాతం (16,750) ఢిల్లీ, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌)లోనే ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై, పరిసరాల్లో 5,300, బెంగళూరులో 3,960 యూనిట్ల నిర్మాణం పూర్తయింది. హైదరాబాద్‌లో మాత్రం 11,450 పెండింగ్‌ యూనిట్లకు కేవలం 1,710 యూనిట్ల నిర్మాణమే పూర్తయింది. చెన్నైలో అతి తక్కువ పెండింగ్‌ యూనిట్లు (5,190) ఉండగా వాటిలోనూ 3,680 యూనిట్ల నిర్మాణం ఈ ఏడాది జనవరి, మే మధ్య పూర్తయింది!

‘‘పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డెవలపర్లు పట్టుదలతో ఉన్నారు. ఇన్‌పుట్‌ ధరలు బాగా పెరిగినా, ఇతర ప్రతిబంధకాలున్నా గత ఐదు నెలల్లో వేల యూనిట్ల నిర్మాణం పూర్తవడం శుభ పరిణామం. మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించే లక్ష్యంతో 2019లో కేంద్రం రూ.25 వేల కోట్లతో మొదలు పెట్టిన ఫండ్, నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ సాయంతో నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి’’
– ప్రశాంత్‌ ఠాకూర్, సీనియర్‌ డైరెక్టర్,  హెడ్‌ రీసెర్చ్, అనరాక్‌ గ్రూప్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top