‘అమ్మ’ బర్త్‌ డే: తనయుడి గిఫ్ట్‌కు ఆనందంలో తేలిన మాతృమూర్తి

Son Booked Helicopter Ride To Mother Birth Day In UlhasNagar - Sakshi

ముంబై: కష్టపడి పెంచి పెద్ద చేసింది.. తండ్రి లేని లోటును పూడుస్తూ.. అన్నీ తానై వ్యవహరించి స్థితిమంతులుగా తీర్చిదిద్దింది. అటువంటి మాతృమూర్తికి పుట్టిన రోజు సందర్భంగా ఓ తనయుడు అరుదైన కానుక అందించాడు. ఆమె జీవితంలో ఎప్పుడూ ఎరుగని గిఫ్ట్‌ ఇవ్వడంతో ఆ తల్లి ఆనందంలో మునిగి తేలింది. ఆమె కళ్లల్లో ఆనందం చూసి ఆ తనయుడు తన్మయత్వం పొందాడు. ఆ తల్లీకుమారుల వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌కు చెందిన రేఖకు ముగ్గురు సంతానం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త అర్దాంతరంగా తనువు చాలించాడు. అప్పటి నుంచి పిల్లలను ఆమె కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచింది. ఇతరుల ఇళ్లల్లో పనిచేసి వీరిని పోషించింది. ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానంలో స్థిరపడేలా శక్తి మేరకు కష్టపడింది. తల్లి కష్టానికి తగ్గట్టు పిల్లలు స్థిరపడ్డారు. అయితే 19వ తేదీన తల్లి 50వ జన్మదినం సందర్భంగా ఆమె చిరకాల కోరిక నెరవేర్చాలని పెద్ద కుమారుడు ప్రదీప్‌ నిర్ణయించుకున్నాడు.

ప్రఖ్యాత్య ఎంఎన్‌సీ కంపెనీలో పని చేస్తున్న కుమారుడు ప్రదీప్‌ తన చిన్నప్పుడు ఇంటిపై ఉండగా హెలికాప్టర్‌ వెళ్తుంటే ‘మనం ఎప్పుడైనా అందులో కూర్చోగలమా’ అని తల్లి ఆవేదన చెందింది. ప్రదీప్‌ ఆ మాటను అప్పటి నుంచి మనసులో దాచుకున్నాడు. ఎలాగైనా అమ్మను హెలికాప్టర్‌ ఎక్కించాలని ధ్రుడంగా అనుకున్నాడు. ఇప్పుడు స్థితిమంతులుగా కావడంతో కుమారుడు ప్రదీప్‌ తల్లి 50వ జన్మదినోత్సవం సందర్భంగా హెలికాప్టర్‌ ఎక్కించాడు. జుహు ఎయిర్‌బేస్‌కు వెళ్లి తల్లితో పాటు కుటుంబసభ్యులను హెలికాప్టర్‌లో కూర్చొబెట్టారు. ఉల్లాస్‌నగర్‌ పట్టణమంతా హెలికాప్టర్‌ రెండు రౌండ్లు చక్కర్లు కొట్టింది. 

కుమారుడు తన మాటలను గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఆ కోరిక తీర్చడంతో ఆ తల్లి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆకాశం ఎత్తుపై నుంచి భూమిని చూస్తుండగా పిల్లలు కేరింతలు కొట్టగా.. ఆ తల్లి మాత్రం కుమారుడిని చూస్తూ కన్నీళ్లు రాల్చింది. ఆ తల్లీకుమారుడు ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తల్లీకుమారుల ప్రేమానుబంధంపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. తల్లికి జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చిన ఆ కుమారుడిని ప్రశంసిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top