వంటగదిలో ఎవరున్నారు.. రాహులే రాశీ!

Smriti Irani Shares Spoof Funny Video Of Rasode Mein Kaun Tha Rap - Sakshi

ఫన్నీ వీడియో షేర్‌ చేసిన స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేరు వినగానే ఆమె వాక్చాతుర్యంతో పాటుగా.. నటిగా తనలోని భిన్న కోణాలు తెరపై ఆవిష్కరించిన తీరు గుర్తుకువస్తుంది. గతంలో హిందీ సీరియళ్లతో పాటు పలు సినిమాల్లో నటించిన ఆమె.. తర్వాత కాలంలో బీజేపీలో చేరి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. అంతేకాదు గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంచుకోట ఆమేథీలో.. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌ గాంధీని ఓడించి సత్తా చాటారు. తద్వారా మోదీ కేబినెట్‌ 2.0లో మరోసారి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఇక వీలు చిక్కినప్పుడల్లా రాహుల్‌పై వ్యంగ్యాస్గ్రాలు సంధించే స్మృతి ఇరానీ తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. 

ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే..
హిందీ సీరియళ్లు చూసే వారికి ‘సాథ్‌ నిబానా సాథియా’ సీరియల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ ప్రముఖ చానెల్‌ ప్రసారమై సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సీరియల్‌ను తెలుగులో కూడా ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ పేరుతో డబ్‌ చేశారు. ఇందులో ముఖ్యపాత్రలైన కోకిలాబెన్(అత్త క్యారెక్టర్‌)‌, గోపీ వహూ(కోడలు గోపిక), రాశి బెన్‌(చిన్న కోడలు రాశి) మధ్య వచ్చే సన్నివేశాలపై మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌ యశ్‌రాజ్‌ ముఖాతే ఇటీవల ఓ రాప్‌ సాంగ్‌ను రూపొందించాడు. చిన్న తప్పునైనా సహించని కోకిలా బెన్‌.. వంటగదిలో ఖాళీ కుక్కర్‌ను గ్యాస్ స్టౌ‌పై ఎవరు పెట్టారంటూ కోపంగా ఆరా తీసే సంభాషణను స్పూఫ్‌తో ఫన్నీగా మార్చేశాడు. ఇక అప్పటి నుంచి ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సామాన్యులతో పాటు బాలీవుడ్‌ తారలు దిశా పటానీ, కార్తిక్‌ ఆర్యన్‌ వంటి సెలబ్రిటీలు దీనిని అనుకరిస్తూ వీడియోలు షేర్‌ చేస్తున్నారు.(చదవండి: ‘కర్మకు సరైన నిర్వచనం ఇదే’)

రాహులే రాశీ..!
‘‘నిన్న నాపైన జ్యూస్‌ ఒలికిపోయింది. ఆ తర్వాత నేను రెండోసారి స్నానం చేసేందుకు వెళ్లాను. ఆ తర్వాత నువ్వు కుక్కర్లో చనా వేసి నా దగ్గరకు వచ్చావు. అప్పుడు వంటగదిలో ఎవరు ఉన్నారు? అక్కడ ఎవరున్నారు? నేను ఉన్నానా.. నువ్వు ఉన్నావా.. ఎవరున్నారు? ఎవరూ చెప్పు?’’అంటూ కోకిలాబెన్‌ గద్దించగానే.. గోపీ.. రాశీ బెన్‌ అంటూ సమాధనమిస్తుంది. అప్పుడు.. ‘‘ఈ రాశి కుక్కర్‌లో నుంచి శనగలు తీసేసి ఖాళీ కుక్కర్‌ గ్యాస్ స్టౌ‌ మీద పెట్టింది.. హే రాశీ!’’అంటూ కోకిలా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక వీడియోను ఓ నెటిజన్‌ స్మృతి ఇరానీ, రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలకు అన్వయిస్తూ స్పూఫ్‌ చేశాడు.

కోకిలా పాత్రలో స్మృతి, గోపి పాత్రలో సోనియాను ఊహిస్తూ జత చేసిన విజువల్స్‌లో ఆఖరున బీజేపీ నేత సంబిత్‌ పాత్రా విజువల్‌ను జత చేసి.. ‘‘రాహులే రాశీ’’అని వ్యాఖ్యానించినట్లుగా సృష్టించాడు. నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఈ వీడియోను షేర్‌ చేసిన స్మృతి ఇరానీ.. ‘‘ఆ పని చేసింది ఈ పిల్లాడే అన్నమాట. చాలా క్యూట్‌గా ఫన్నీగా ఉంది. రాజకీయాలకు సంబంధించింది కాదు. కేవలం వినోదం కోసమే ఇది. రసోదీ మే కౌన్‌ థా(వంటగదిలో ఎవరున్నారు) రాశి బెస్ట్‌ వర్షన్‌’’అని క్యాప్షన్‌ జతచేశారు. ఇక ఇలాంటి ఫన్నీ వీడియోలతో పాటు తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలు, స్ఫూర్తిమంతమైన సందేశాలను స్మృతి తరచుగా పోస్ట్‌ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top