
న్యూఢిల్లీ: కోట్లాది భారతీయుల అంతరిక్ష స్వప్నాన్ని సాకారం చేస్తూ యాగ్జియం–4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు చేరుకున్న భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా తన శాస్త్రీయ ప్రయోగాల పర్వానికి శ్రీకారం చుట్టారు. శూన్యస్థితిలో మనిషి కండర క్షీణతపై శుక్లా అధ్యయనంమొదలెట్టారు. కండరాల క్షీణతకు గురుత్వాకర్షణ ఏ మేరకు కారణమవుతుంది? ఈ రెంటి మధ్య సంబంధాలేంటి? అంశాలపై ఆయన పరిశోధనలు సాగుతున్నాయని యాగ్జియం స్పేస్ సంస్థ పేర్కొంది.
చాలా రోజులపాటు అంతరిక్షయాత్రల్లో గడిపే వ్యోమగాములను కండరాల క్షీణత పెద్దసమస్యగా తయారైంది. దీనికి పరిష్కారం కనుగొనేందుకు శుక్లా ప్రయతి్నస్తున్నారు. పరిశోధనలో భాగంగా త్రిమితీయ అస్థిపంజర కండరం నుంచి సూక్ష్మస్థాయిలో కణజాలాన్ని అత్యంత స్వల్పస్థాయి గురుత్వాకర్షణకు గురిచేసి మార్పులను గమనించారు. మయోడీ1, మయోజీ కణ నియంత్రకాల పనితీరు సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో ఎలా ఉందో శుక్లా పరిశీలించారు.