సీనియర్లు నావైపు ఉంటారని అనుకోను! కానీ..: శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

Shashi Tharoor Says Rahul Gandhi Told Me Must Run For President - Sakshi

తిరువనంతపురం: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పోటీ నుంచి తనను తప్పుకోవాలని రాహుల్‌ గాంధీ సూచించినట్లు వస్తున్న కథనాలను తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ ఖండించారు. అయితే.. కొందరు కాంగ్రెస్‌ సీనియర్లు మాత్రం ఈ విషయమై రాహుల్‌ గాంధీని సంప్రదించినట్లు తెలిసిందని, ఆ విషయాన్ని స్వయంగా రాహుల్‌ గాంధీనే తనతో చెప్పారని థరూర్‌ వివరించారు. 

‘‘థరూర్‌ ఆ పోస్టుకు సరితూగడు. ఆయన్ని కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నుంచి నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా విజ్ఞప్తి చేయండి’’ అని రాహుల్‌ గాంధీని కొందరు సీనియర్లు కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై కేరళలో ప్రస్తుతం పోల్‌ క్యాంపెయిన్‌లో ఉన్న థరూర్‌.. మీడియాతో మాట్లాడారు. 

రాహుల్‌ గాంధీతో సంభాషణ సందర్భంగా నాకు ఈ విషయం తెలిసింది. నన్ను నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని ఆయన్ని(రాహుల్‌) కొందరు సీనియర్లు కోరారట.  కానీ, ఆయన మాత్రం అందుకు అంగీకరించలేదు. నేను పోటీ చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని రాహుల్‌ భావిస్తున్నట్లు చెప్పారట. పైగా పార్టీ అధినేత పదవికి పోటీ చేయాలని పదేళ్లుగా చెబుతున్నానంటూ ఆయన నాకు గుర్తు చేశారు.

ఎన్నికల నుండి తప్పుకోవడం ద్వారా తన ఈ ప్రయత్నంలో ఇప్పటివరకు తనకు మద్దతు ఇచ్చిన వారికి ద్రోహం చేయబోనని కూడా థరూర్ చెప్పారు. ‘‘తన మద్దతుదారులలో ఎక్కువ మంది యువ నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారన్న థరూర్‌.. ఈక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రెసిడెంట్‌ సుధాకరన్‌.. మల్లికార్జున ఖర్గేతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. తద్వారా తన మద్దతును చెప్పకనే చెప్పారాయన. ఈ పరిణామంపై థరూర్‌ స్పందించారు. ‘‘సీనియర్లు నాకు మద్దతు ఇస్తారని ఏనాడూ అనుకోలేదు. ఇప్పుడు జరుగుతుందని కూడా అనుకోను. కానీ, అదే సమయంలో ప్రతీ ఒక్కరి మద్దతును తాను కోరుకుంటున్నట్లు థరూర్‌ తెలిపారు. అయితే యువతతో పాటు అన్ని వయస్కుల నుంచి తనకు మద్దతు అవసరమని, అందుకే ఎవరినీ తగ్గించి మాట్లాడబోనని కూడా థరూర్‌ అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 17న జరగనుండగా.. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 19న చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. సుమారు 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. మార్పు నినాదంతో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల కోసం శశిథరూర్‌ ప్రచారం నిర్వహిస్తుండగా‌.. పార్టీ కోసం అహర్నిశలు పని చేసే సీనియర్‌ నేతగా, ‘దళిత’ మార్క్‌తో బరిలో దిగనున్నారు మల్లికార్జున ఖర్గే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top