ఎవర్నీ వదిలిపెట్టమన్న సీఎం యోగి.. యూపీలో మరో ఎన్‌కౌంటర్‌

Second Encounter In Umesh Pal Case At Uttar Pradesh - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉమేష్‌ పాల్‌ హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో సోమవారం ఉదయం యూపీ పోలీసులు మరో నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేశారు. కాగా, ఉమేష్‌ పాల్‌పై మొదట కాల్పులు జరిపిన ఉస్మాన్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. యూపీలో బీఎస్పీకి చెందిన రాజ్‌ పాల్‌ను 2005లో హత్య చేశారు. ఈ కేసులో ప్రధాని సాక్షిగా ఉన్న ఉమేష్‌ పాల్‌ను ఆరుగురు వ్యక్తులు గత వారం నడిరోడ్డుపై కాల్పులు జరిపి హత్య చేశారు. దీనిపై యూపీ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కూడా తీవ్ర దుమారం రేగింది. దీంతో, సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. నేరుస్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉమేశ్ భార్య జయ పాల్‌ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్‌, ఇద్దరు అనుచరులు, మరో తొ‍మ్మిది మందిపై కేసులు నమోదు చేశారు.

కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారా పోలీసు స్టేషన్‌లో నిందితుడు విజయ్‌ అలియాస్‌ ఉస్మాన్‌ను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఉమేశ్‌ పాల్‌పై కాల్పులు జరిపిన వారిలో ఉస్మాన్‌ మొదటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కాగా.. ఈ కేసులో మరో నిందితుడు అర్బాజ్‌ను ఫిబ్రవరి 27న పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. అతడు పారిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. 

ఇదిలా ఉండగా.. యూపీలో 2004లో జరిగిన అలహాబాద్‌ అసెంబ్లీ  స్థానం ఉప ఎన్నికల్లో రాజ్‌ పాల్‌ బీఎస్పీ తరఫున  పోటీచేసి విజయం సాధించారు. ప్రత్యర్థిగా ఉన్న అతీక్‌ అహ్మద్‌(ఎస్పీ) తమ్ముడు ఖలీద్‌ అజిమ్‌ ఓటమి చెందారు. కాగా, ఈ ఎన్నికల జరిగిన కొన్ని రోజులకే రాజ్‌ పాల్‌ హత్యకు గురయ్యారు. ఈ కేసులోనే ఉమేష్‌ సాక్షిగా ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top