పలు దేశాల్లో సరికొత్త ట్రెండ్
నడిచినా, వ్యాయామం చేసినా బహుమతులు..ప్రోత్సాహకాలు
వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు వినూత్న పద్ధతులు
రోజూ 20–30 నిమిషాలు నడిస్తే దీర్ఘకాలిక జబ్బులకు 40శాతం వరకు చెక్!
(సాక్షి, స్పెషల్ డెస్క్) : రోజుకు కేవలం 20 నిమిషాల నడక లేదా శారీరక వ్యాయామం. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, మీ జేబును కూడా నింపుతుంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ నడుస్తోంది. ప్రజలను శారీరక వ్యాయామం వైపు మళ్లించేందుకు, తద్వారా వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు పలు దేశాల్లో ప్రభుత్వాలు వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నాయి. నిర్ణీత సమయం పాటు నడిచే లేదా వ్యాయామం చేసే పౌరులకు నగదు బహుమతులు, షాపింగ్ వోచర్లు తదితర ప్రోత్సాహకాలను నేరుగా అందిస్తున్నాయి. ఈ జాబితాలో సింగపూర్, దుబాయ్ (యూఏఈ), కెనడాలతో పాటు కొత్తగా యునైటెడ్ కింగ్‌డమ్ చేరింది.
ఏటా 2,700 కోట్ల డాలర్ల భారం
ఆధునిక జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ వైద్య బడ్జెట్లపై పెనుభారం పడుతోంది. శారీరక వ్యాయామం కొరవడినందున ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థలకు ప్రతి ఏటా సుమారు 2,700 కోట్ల డాలర్ల నష్టం జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. పౌరులు రోజుకు 30 నిమిషాలు నడక తదితర శారీరక వ్యాయామాలు చేస్తే, ఈ దీర్ఘకాలిక వ్యాధులను 40 శాతం వరకు అరికట్టవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు వ్యాయామానికి ప్రోత్సాహకాలు ఇవ్వడంపై పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి.
నెలలో 42 కి.మీ. నడక
ఆరోగ్యం కోసం అనుదినం నడిచే దేశ పౌరులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వచ్చే జనవరిలో ప్రారంభం కానున్న ‘మూవ్‌మెంట్ 26.2‘అనే నడక సవాలు కార్యక్రమానికి ఒలింపిక్స్ పతక విజేత సర్ బ్రెండన్ ఫోస్టర్ నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు రోజుకు కనీసం 20 నిమిషాలు (1.4 కి.మీ.) నడిస్తే, నెలలో 42 కిలోమీటర్లు (పూర్తి మారథాన్ దూరం) నడవగలుగుతారు. తమ నడక వివరాలను ఆన్‌లై¯న్‌లో లేదా ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌ల ద్వారా నమోదు చేసుకోవాలి.
నడక సవాలును పూర్తిచేసిన వారికి డిస్కౌంట్ వోచర్లు, ఇతర బహుమతులు లభిస్తాయి. ‘ఇది నిజంగా ఒక సరళమైన, సాధించదగిన, అర్థవంతమైన ప్రయోజనాలందించే సవాలు..’అని బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధాని కీర్ స్టార్మర్ అభివర్ణించారు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ‘ఫిట్ ఇండియా’ప్రచారోద్యమాన్ని నడుపుతున్నప్పటికీ.. పౌరులకు నేరుగా ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆర్థిక బహుమతులు అందటం లేదు. అయితే దేశంలోని కొన్ని ప్రైవేట్ ఆరోగ్య బీమా కంపెనీలు, కొన్ని ఫిట్‌నెస్ యాప్‌లు రోజువారీ నడక లక్ష్యాలను చేరుకుంటే ప్రీమియం తగ్గింపులు, రివార్డ్ పాయింట్లను ఇస్తున్నాయి.
ఏ దేశంలో ఎంత నడక, ఎలాంటి ప్రోత్సాహకాలు?
» సింగపూర్ నేషనల్ స్టెప్స్ చాలెంజ్ (హెల్దీ 365 యాప్): రోజుకు 5,000–10,000 అడుగులు లేదా 20 నిమిషాల శ్రమ/ సూపర్ మార్కెట్ వోచర్లు, ఉచిత రవాణా (సబ్‌వే/బస్) పాస్‌లు
» యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ఎన్‌హెచ్‌ఎస్ బెటర్ హెల్త్ (పైలట్ ప్రాజెక్ట్): రోజుకు 20–30 నిమిషాల చురుకైన నడక/ షాపింగ్ డిస్కౌంట్లు, ఉచిత సినిమా టికెట్లు, జిమ్ వోచర్లు
» దుబాయ్ (యూఏఈ) దుబాయ్ ఫిట్‌నెస్ చాలెంజ్ (30్ఠ30): ప్రతిరోజూ 30 నిమిషాల చొప్పున నెల వ్యాయామం/ ప్రత్యేక డిస్కౌంట్ కూపన్లు, లక్కీ డ్రా ద్వారా బహుమతులు
» కెనడా పార్టిసిప్ యాక్షన్ (ప్రభుత్వ నిధులు): నిర్దేశిత వారపు / నెలవారీ ఫిట్‌నెస్ లక్ష్యాలు సాధించాలి/స్పోర్ట్స్ గియర్, బ్రాండెడ్ వస్తువులు గెలుచుకునే అవకాశం


