ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తాయ్ చి వాకింగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ప్రజలు కూడా ఈ వాకింగ్ చేసేందుకు అమితమైన ఆసక్తికనబరుస్తుండటం విశేషం. ఈ వాకింగ్ పొట్లలోని కొవ్వుని అమాంతం కరిగించేస్తుందని, బరువు తగ్గిపోతారంటూ తెగ ఊదరగొట్టేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు. ముఖ్యంగా పెద్దలకు, వృద్ధులకు చాలామంచిదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి తాయ్ చి వాకింగ్..?, దీని వల్ల నిజంగా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.
ఈ తాయ్ చి వాకింగ్ గురించి ముంబైకి చెందిన తాయ్ చి గురువు సెన్సాయి సందీప్ దేశాయ్ ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా సవివరంగా వెల్లడించారు. ఇది ఎలా చేస్తారు. దీని వల్ల కలిగే లాభలు ఏంటి వంటి వాటి గురించి తెలిపారు.
తాయ్ చి వాకింగ్ అంటే..
తాయ్ చి వాకింగ్ అనేది శరీరాన్ని నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా కదిలించే ఒక విధమైన నడక పద్ధతి. దీనిలో సమతుల్యత, శరీర భంగిమ, సమన్వయం, కీళ్లపై అధిక భారం పడకుండా నియంత్రిత బరువు మార్పిడిపై ఫోకస్ పెడతూ చేసే వాకింగ్ అని చెప్పుకొచ్చారు సందీప్ దేశాయ్. తాయ్‌గా ఈ పిలిచే ఈ వర్కౌట్ యుద్ధ కళల సాధనలో ఒక భాగం అని అన్నారు.
ఇది పూర్తిగా కదలికపై దృష్టి సారించే ఒక వ్యాయామం అని చెప్పారు. ఇటీవల కాలంలో దీనికి అమిత ఆదరణ పెరిగిందన్నారు. అయితే ఈ తాయ్ చి అనేది వేల సంవత్సరాల చైనా చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంతర్గత యుద్ధ కళ, ఆరోగ్య వ్యాయామం కూడా. భారత్‌కి యోగా ఎలాగో అక్కడ చైనాలో ఈ తాయ్ చి అలా అని సందీప్ దేశాయ్ అన్నారు.
ఎలా చేస్తారంటే..
సరైన విధంగా నేర్చుకోవడం అనేది అత్యంత కీలకం. ఇది శరీర బరువుని మారుస్తూ జాగ్రత్తగా చేసే వ్యాయామం. ఒక కాలుపై శరీరం బరువు మోపుతూ నిదానంగా మరోక కాలు ఎత్తాలి. ఆ తర్వాత మెల్లగా గాల్లో ఉన్న ఆ పాదాన్ని మడంపై ఆనించి నెమ్మదిగా భూమిపై పూర్తిగా ఆనాలి. ఆ తర్వాత మరో కాలుని నెమ్మదిగా ఎత్తి ఈ పాదంపై శరీర బరువుని మోపాతూ.. కంటిన్యూ చేయాలి.
వృద్ధులకు ఇది ఎందుకు మంచిదంటే..
ఈ వాకింగ్ కాళ్లపై చాలా తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. సాధారణంగా వృద్ధులకు మోకాళ్ల నొప్పి, బిగువు లేదా నడుమునొప్పితో బాధపడేవారికి చాలా ముఖ్యం. శరీర బరువుని ఒక కాలు నుంచి మారుస్తూ తనను తాను మెరుగ్గా స్థిరపరుచుకునే ట్రైన్ చేస్తుంది. అలాగే స్లిప్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని నిటారుగా వంచడంలో ఉపకరిస్తుంది. పైగా ఇది మనస్సు, శరీరంపై ధ్యాస పెట్టి చేయాల్సిన వర్కౌట్‌కావడంతో ఏకాగ్రత మెరుగుపడుతుంది.
కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
హృదయ సంబంధ వ్యాధుల పరంగా చూస్తే, ఇది రక్త ప్రసరణ, శ్వాస, ఊపిరితిత్తుల పనితీరు తోడ్పడే తేలికపాటి ఏరోబిక్ కదలికలా పనిచేస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, నాడీ సంబంధిత సమస్యలు ఉన్న రోగులకు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఇది సమతుల్యమైన నడకను ప్రోత్సహిస్తుంది. అలాగే శరీరం-మనస్సు సమన్వయాన్ని మెరుగుపరుస్తుందని డాక్టర్ పటేల్ నొక్కి చెప్పారు.
ఇది అనారోగ్యం లేదా గాయం నుంచి కోలుకోవడాన్ని కూడా వేగవంతం చేస్తుంది. చాలా మంది అథ్లెట్లు, క్రీడాకారులు, యోగా సాధకులు, మార్షల్ ఆర్టిస్టులు మెరుగ్గా ఉండేలా, గాయాల బారి నుంచి రక్షించుకోవడానికి ఈ తాయ్ చి వాకింగ్‌ని చేస్తారని సెన్సాయి సందీప్ అన్నారు. అంతేగాదు శారీరక శ్రమకు దూరంగా ఉన్నవారికి ఫిట్‌నెస్‌లోకి తిరిగి రావడానికి ఇది ఒక మంచి మార్గంగా పనిచేస్తుంది.
బరువు తగ్గిస్తుందా అంటే..
కేవలం ఏడు నిమిషాల తాయ్ చి మాత్రమే పొట్టలోని కొవ్వును అద్భుతంగా కరిగించకపోవచ్చు. పరుగు లేదా తీవ్రమైన కార్డియో వ్యాయామం లాగా ఇది అధిక కేలరీలను దహించే వ్యాయామం కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీనిని బరువు తగ్గడానికి ఒక షార్ట్‌కట్‌గా భావించడం సరైనది కాదని అంటున్నారు. కానీ పొట్టలోని కొవ్వును తగ్గించడానికి, కోర్ స్ట్రెంగ్తెనింగ్ వ్యాయామాలు, అధిక తీవ్రతతో కూడిన వర్కౌట్‌లు, నియంత్రిత కార్బోహైడ్రేట్లతో కూడిన సమతుల్యత, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం కలయికతోనే బరువు తగ్గడం సాధ్యమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
తప్పక తెలుసుకోవాల్సినవి..
తాయ్ చి వాకింగ్‌ని సరైన మార్గదర్శకత్వంలోనే చేయాలి లేదంటే కీళ అమరిక, జాయింట్ల మధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే కీళ్లవాతం లేదా వెన్నుముక సమస్యలు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం.
(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!)


