నాడు నీట్‌ ఫెయిల్యూర్‌..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు! | Woman Who Failed NEET Shares How Life Changed, Indian-Origin Creator Pragya Gupta Viral Success Story, Watch Video | Sakshi
Sakshi News home page

నాడు నీట్‌ ఫెయిల్యూర్‌..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!

May 25 2026 9:42 AM | Updated on May 25 2026 10:45 AM

Woman who failed NEET shares how life changed after Goes Viral

ఇవాళ భారతదేశంలో కాంపీటీటివ్‌ ఎగ్జామ్స్‌ సంస్కృతి ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులు, యువతకు అదే జీవిత పరమావధి అన్నంతగా మారిపోయాయి పరిస్థితులు. ఒకవేళ అది ఫెయిలైతే జీవితం అయిపోయినట్లుగా లేదా ముగిసిపోయినట్లుగా భావిస్తారు. మరికొందరు ఎన్నటికీ విజయాన్ని అందుకోలేని పరాజితులుగా ముద్ర వేసుకుంటారు. ఇంకో రంగంలో లేదా మరేదైన అభిరుచినో ఎంచుకుని గమ్యం చేరుకునే యత్నం చేయరు. కానీ ఈ కంటెంట్‌ క్రియేటర్‌ తన సక్సెస్‌ స్టోరీతో ఆ ఆలోచన విధానమే తప్పు అని నొక్కి చెప్పింది. ఆ ఒక్క కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ మన జీవితాన్ని, సక్సెస్‌ని నిర్ణయించదని తన గెలుపుతో నిరూపించింది ఈ భారత సంతతి మహిళ. 

ఎవరంటే ఆమె..? అమెరికాలో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రజ్ఞాగుప్తా. దాదాపు దశాబ్దం క్రితం నీట్‌ పరీక్షల్లో విఫలమవ్వడం ఆమెను ఊహించని విధంగా ఐవీ లీగ్‌ విద్యవైపు అడుగులు వేసి ఎలా బయోటెక్నాలజీ పరిశ్రమలో కెరీర్‌ నిర్మించుకునేలా చేసిందో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకోవడంతో ఆమె కథ నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా భారతదేశంలో పోటీ ప్రవేశ పరీక్షల చుట్టూ ఉన్న తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఆమె కథ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. 

నిజానికి ప్రజ్ఞ 2016లో 17 ఏళ్ల వయసులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసింది, కానీ మెడికల్ లేదా డెంటల్ కళాశాలలో ప్రవేశం పొందడంలో విఫలమైంది. భారతదేశంలోని అత్యంత పోటీతత్వ విద్యా వాతావరణంలో పెరిగిన ప్రజ్ఞ కూడా చాలా మంది విద్యార్థుల మాదిరిగానే, ఈ ఎదురుదెబ్బ బయాలజీ, హెల్త్‌కేర్ రంగాలలో తన కెరీర్ ఆశయాలను ముగించిందని చాలా బాధపడింది. ఆమె ఓటమి తన కుటుంబాన్ని సైతం తీవ్రగా ప్రభావితం చేసింది. 

సైన్స్‌ చదివే విద్యార్థులు నీట్‌ పరీక్షని  అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షగా భావిస్తారు. అయితే ప్రజ్ఞ ఆ పరీక్షను మరోసారి ప్రయత్నించి చూడటం వంటి వాటికి బదులుగా జీవశాస్త్రంపై ఉన్న ఆసక్తికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. ఆ క్రమంలోనే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశ్యంతో అమెరికాకు పయనమైంది. అక్కడ ప్రముఖ ఐవీ లీగ్ సంస్థలలో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది.

ప్రస్తుతం ఆమె అమెరికాలోని కార్పొరేట్ బయోటెక్నాలజీ పరిశ్రమలో నిపుణురాలిగా పనిచేస్తోంది. అందరిలానే పాఠశాల విద్య తర్వాత డాక్టర్‌ అయ్యే సంప్రదాయ నీట్‌ ప్రవేశపరీక్ష వైపుకు వెళ్లింది..కానీ అనుకోని ఓటమి ఆ దారిని క్లోజ్‌ చేసింది. ఆ ఎదురుదెబ్బ తన జీవితాన్ని గొప్ప యూటర్న్‌ తిప్పే ప్రత్యామ్నాయం వైపు ఫోకస్‌ పెట్టింది. అలాగే తాను కోరుకున్నట్లుగానే ఆరోగ్య సంరక్షణ రంగంలోనే కెరీర్‌ని నిర్మించుకుంది.  

ఒక విద్యా పరీక్షలో వైఫల్యం ఒక వ్యక్తి భవిష్యత్తు విజయాన్ని లేదా ఆనందాన్ని నిర్ణయించదనే వాస్తవాన్ని తన గెలుపుతో చాటిచెప్పిందామె. కాగా, అత్యంత పోటీతత్వ, ప్రతిష్టాత్మకమైన ఈ ఎగ్జామ్‌లో ఫెయిల్‌ అవ్వడం వల్ల కలిగిన మానసిక వేదన..దాన్నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి డ్రీమ్‌ కెరీర్‌ని చేరుకోవడం వరకు సాగిన ఆమె కెరీర్‌ జర్నీ విద్యార్థులకు భరోసా ఇచ్చేలా ఉందంటూ నెటిజన్లు ప్రజ్ఞను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అంతేగాదు  సైన్స్, హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ రంగాలలో కెరీర్లు కేవలం నీట్ ద్వారా డాక్టర్ అవ్వడం వరకే పరిమితం కావు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి.

 

(చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement