జేఈఈ అడ్వాన్స్‌డ్.. దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలో ఒకటి. అలాంటి పరీక్షంలో సింగిల్, డబుల్ డిజిట్ ర్యాంకులు సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ఆ ర్యాంక్‌తో.. ఐఐటీ బాంబే లాంటి ప్రతిషాత్మక వర్సిటీలో సీటు దక్కించుకోవడం గొప్ప అవకాశం కాదంటారా?. కానీ ఒడిశాకు చెందిన ఓ విద్యార్థి.. అదెంత మాత్రం కాదనే అంటున్నాడు. ఎందరో ఆ అవకాశం కోసం కళ్లు కాయలు కాసేలా చదువుతుంటే.. చేతిదాకా వచ్చిన ఆ అవకాశాన్ని పక్కన పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది..
ఒడిశాకు చెందిన మహరూఫ్.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026లో 32వ ర్యాంకర్. ఈ ర్యాంక్‌తో ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీటు సులభంగా దక్కుతుందని అతని పేరెంట్స్ ఆశపడ్డారు. అయితే.. మహరూఫ్ మాత్రం వద్దని వాళ్లతో చెప్పేశాడు. అందుకు కారణం.. అన్న మస్రూర్‌కు దూరం కావడమే!.
మస్రూర్, మహరూఫ్ కవలలు. ఇద్దరూ ఈ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మస్రూర్ ఆల్ ఇండియాలో 169వ ర్యాంక్ పొందాడు. అయితే.. అన్నని వీడి ఉండలేని మస్రూర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐఐటీ బాంబే సీటు కాదని.. తన అన్నతోపాటు మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరేందుకు సిద్ధమయ్యాడు. ‘‘నేను అన్నతో కలిసి చదవాలనుకుంటున్నాను” అని మహరూఫ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మస్రూర్ కూడా తన తమ్ముడి నిర్ణయాన్ని ఎంతో భావోద్వేగంగా స్వీకరించాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్‌గా ఉన్నామని, ఇప్పుడు కూడా కలిసి చదవడమే తమకు ముఖ్యమని అతను చెప్పాడు. ఈ నిర్ణయం వారి కుటుంబానికి ఎంతో గర్వకారణంగా మారింది. అలాగే వారి విజయం వెనుక తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకం. తండ్రి డాక్టర్‌గా పనిచేస్తుండగా, తల్లి డాక్టర్ జీనత్ బెగం తన ఉద్యోగాన్ని వదిలి పిల్లలతో కలిసి కోటా(రాజస్థాన్, దేశంలో కోచింగ్ హబ్)కు వెళ్లి వారి చదువుకు పూర్తిగా అంకితమయ్యారు. కుటుంబం నుంచి వచ్చిన ఈ మద్దతే ఇద్దరి విజయానికి బలమైన పునాది అయింది.
కోటాలో ఉన్న సమయంలో ఇద్దరూ అత్యంత క్రమశిక్షణతో చదివారు. రోజుకు సుమారు ఐదు గంటల కోచింగ్, గంటసేపు డౌట్స్ క్లియరింగ్, ఆపై గంటల తరబడి స్వీయ అధ్యయనం చేసేవారు. అదే సమయంలో పరస్పరం ఒకరికి ఒకరు క్లిష్టమైన అంశాలు వివరించడం, పరీక్షల తర్వాత కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వారి ప్రత్యేకతగా నిలిచింది.

ఇప్పుడు ఈ ఇద్దరి కథ కేవలం ర్యాంకుల గురించి మాత్రమే కాదు, బంధాల విలువ గురించి కూడా చెబుతోంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీటును కూడా వదిలేసి కుటుంబం కోసం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థి జీవితంలో సక్సెస్ అంటే ఏమిటో కొత్తగా నిర్వచిస్తోంది. ర్యాంకులు, కాలేజీలు ఎంత గొప్పవైనా, బంధాలు వాటికన్నా గొప్పవని మహరూఫ్ తీసుకున్న నిర్ణయం నిరూపిస్తోంది.


