నేనూ మీలో ఒకడినే!  | Rahul Gandhi Says BJP To Disrespect Tamil People In Road Show | Sakshi
Sakshi News home page

నేనూ మీలో ఒకడినే! 

Jan 25 2021 6:53 AM | Updated on Jan 25 2021 8:48 AM

Rahul Gandhi Says BJP To Disrespect Tamil People In Road Show - Sakshi

సాక్షి, చెన్నై: తాను తమిళనాడులో పుట్టలేదని, అయితే నేనూ తమిళుడ్నే, మీలో ఒకడినే అంటూ ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రజల్ని ఆకర్షించే ప్రసంగంతో ఆదివారం ఈరోడ్, తిరుప్పూర్‌లలో దూసుకెళ్లారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం తమిళనాడుకు వచ్చిన రాహుల్‌గాంధీ శనివారం కోయంబత్తూరులో పర్యటించారు. రెండవ రోజు ఈరోడ్, తిరుప్పూర్‌లలో ఆయన పర్యటన సాగింది. చేనేత కార్మికులు, రైతులు, మహిళా సంఘాలు, వర్తకులతో సమావేశాలు, రోడ్‌ షోలు, కాసేపు వాకింగ్‌తో ప్రజలకు పలకరింపు, సాయంత్రం బహిరంగసభ అంటూ రాహుల్‌ పరుగులు తీశారు. ప్యాంట్, టీషర్టుతో ఉరకలు పరుగులతో ముందుకు సాగారు. అలాగే తిరుప్పూరులో మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తన దగ్గరికి వచ్చిన వారితో సెల్ఫీలు దిగారు. 

మోదీ గుప్పెట్లో.. 
ఈరోడ్‌ – తిరుప్పూర్‌ సరిహద్దులోని ఊత్తుకులిలో జరిగిన సభలో రాహుల్‌ ప్రసంగించారు. తమిళనాడుపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ధ్వజమెత్తారు. తమిళనాడు, ఇక్కడి సంస్కృతి అన్నా తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. తమిళనాడులో అన్ని రకాల వనరులు ఉన్నా, అభివృద్ధి పథంగా ఎదగనివ్వకుండా కేంద్రంలోని మోదీ సర్కారు అడ్డుకుంటోందని ఆరోపించారు. మోదీ గుప్పెట్లో కీలుబొమ్మగా అన్నాడీఎంకే ప్రభుత్వం ఉందని, అందుకే కేంద్రం ఆడించినట్టుగా ఇక్కడ ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమిళంలో మాట్లాడేసి తమిళుల్ని మోసం చేసేద్దామనుకున్నట్టున్నారని, ఆ పాచికలు ఇక్కడ పారబోదన్నది గుర్తుంచుకోండి అంటూ పరోక్షంగా మోదీకి హితవు పలికారు. పలు చోట్ల రాహుల్‌గాంధీ తన భద్రతా ఆంక్షలను లెక్కచేయకుండా వాహనం నుంచి దిగి నడుచుకుంటూ రోడ్డుపై ఉన్న ప్రజల్ని పలకరిస్తూ, కరచాలనం చేస్తూ ఆకర్షించే యత్నం చేశారు. ఒకరిద్దరు కాంగ్రెస్‌ నేతలతో కలిసి రాహుల్‌ ఒంటరిగానే పరుగులు తీశారు. రాహుల్‌ పర్యటనలో ఎక్కడ డీఎంకే వర్గాలు కలవకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement