
న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకూ ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 11వ తేదీ) పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకూ ర్యాలీకి పిలుపునిచ్చిన తరుణంలో ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు. బీజేపీతో కలిసి ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఆరోపించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ఆ క్రమంలోనే ఈసీ కార్యాలయానికి మార్చ్‌గా వెళ్లి మెమోరాండం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
దీనిలో భాగంగా ఆ ఎంపీలంతా పార్లమెంట్ భవనం నుంచి సుమారు కిలోమీటర్ దూరం మాత్రమే ఉన్న ఈసీ కార్యాలయానికి మార్చ్‌గా వెళ్లే క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనిలో భాగంగా ఇండియా కూటమి ఎంపీలను అరెస్ట్ చేశారు. అనంతరం విడుదల చేశారు.
అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్, శివసేన(ఎల్‌బీటీ) నేత ప్రియాంకా చతుర్వేది తదితరులు ఉన్నారు.
ఈ అంశంపై రాహుల్ గాంధీ మీడియా మాట్లాడుతూ.. ‘ ఇది రాజకీయంగా చూడాల్సిన అంశం కాదు. మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన సమయం. ఈ పోరాటం ఏదో రాజకీయ దురుద్దేశంతో చేసేది ఎంతమాత్రం కాదు. ఇది కేవలం వన్ పర్సన్.. వన్ ఓట్ అనే దానిపైనే మా ఉద్యమం’ అని స్పష్టం చేశారు. తాము 300 ఎంపీలం కలిసి ఈసీ కార్యాలయానికి వెళ్లాలని అనుకుంటే తమకు అనుమతి ఇవ్వలేదన్నారు. కొంతమందిని మాత్రమే రమ్మంటున్నారని ఆయన మండిపడ్డారు. తమ పోరాటం బోగస్ ఓట్లపైనేనని, తమ వద్ధ డేటా ఉందని రాహుల్ మరోసారి స్పష్టం చేశారు.
ఈసీని 30 మంది ఎంపీలు కలవొచ్చు..
ఇండియా కూటమి ర్యాలీపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేశ్ కుమార్ మహ్లా స్పందించార. ఎలక్షన్ కమిషన్‌ను 30 మంది ఎంపీలు కలవొచ్చు అదే విషయాన్ని ఈసీ కూడా చెప్పింది. అంతే గానీ ర్యాలీగా 300 మంది ఎంపీలు ర్యాలీగా వెళితే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుందంది. ఆ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకున్నాం’అని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.