ఉపాధి హామీ కూలీల సదస్సులో రాహుల్ గాంధీ పిలుపు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి
వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. గతంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాల వెనుక ఉన్నట్లే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చట్టం రద్దు కోసం కూలీలతో కలిసి పోరాటం సాగించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సందీప్ దీక్షిత్ నేతృత్వంలోని రచనాత్మక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో జరిగిన ఉపాధి హామీ కూలీల సదస్సులో రాహుల్ గాందీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కూలీలు తరలివచ్చారు.
తాము పనులు చేసే స్థలాల నుంచి పిడికెడు మట్టి తీసుకొచ్చారు. మొక్కల కుండీల్లో ఈ మట్టిని చల్లారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పేదలకు హక్కు లు కల్పించడమే ఉపాధి హామీ చట్టం అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. కూలీలంతా ఏకమై పోరాడితే మోదీ వెనక్కి తగ్గుతారని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరిస్తారని చెప్పారు. ఈ సదస్సులో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వ్యవసాయ పనిముట్లను చేతబూని పలుగు పారలు ప్రదర్శించడం విశేషం.
పేద కూలీలకు తీవ్ర నష్టం
‘‘పనులు కావాలని కోరుకునేవారు అందుకోసం గౌరవంగా డిమాండ్ చేసే వెసులుబాటు ఉపాధి హామీ పథకంలో ఉంది. పేదలకు పని హక్కు లభిస్తుంది. ఈ ఉద్దేశాన్ని నాశనం చేయడానికి మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది. 2020లో ఇలాగే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చింది. పార్లమెంట్‌లోపల, బయట రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాం.
దాంతో నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేసింది. అప్పుడు రైతులను లక్ష్యంగా చేసుకున్నారు.. ఇప్పుడు పేద కూలీలను టార్గెట్ చేస్తున్నారు. ఉపాధి పనుల కోసం ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలన్నది ఇక కేంద్రమే నిర్ణయిస్తుంది. సహజంగానే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, విపక్ష పాలిత రాష్ట్రాలకు తక్కువ నిధులు ఇస్తారు. పనులు ఎప్పుడు, ఎక్కడ కల్పించాలి? కూలీలకు ఎంత వేతనం ఇవ్వాలన్నది కేంద్రమే నిర్ణయించబోతోంది.
దాంతో కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. స్వాతంత్య్రం ముందునాటి పరిస్థితులను మళ్లీ తీసుకురావాలన్నదే బీజేపీ నాయకుల ఎత్తుగడ. అప్పట్లో రాజు చేతిలోనే మొత్తం అధికారాలు, సంపద ఉండేవి. ఆధునిక భారతదేశ నిర్మాణాన్ని మార్చాలని బీజేపీ పెద్దలు ఆరాటపడతున్నారు. వారిని అడ్డుకోవాలంటే మనమంతా ఒక్కటై పోరాటం సాగించాల్సిందే. బీజేపీ నాయకులు నిజంగా పిరికిపందలు. మనం కలిసికట్టుగా ముందుకెళ్తే వారంతా పారిపోతారు’’ అని రాహుల్ తేల్చిచెప్పారు.
గాందీజీ పేరును తుడిచిపెట్టే కుట్ర: ఖర్గే
ప్రజల హృదయం నుంచి జాతిపిత మహాత్మాగాంధీ పేరును తుడిచేయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కూలీల సదస్సులో ఆయన మాట్లాడారు.
బడుగు బలహీన అణగారిన వర్గాలను నిర్బంధ కూలీలుగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. పేదలకు ఉపాధి కల్పించే మహత్తర పథకాన్ని రద్దు చేయడం ఏమిటని మండిపడ్డారు. తాను చాయ్‌వాలా అని చెప్పుకుంటున్నారని, నిజానికి ఏనాడూ ఆయన చాయ్ తయారు చేయలేదని, రైళ్లలో తిరుగుతూ విక్రయించలేదని ఖర్గే అన్నారు. చాయ్‌వాలా పేరిట మోదీ చేసేదంతా ఉత్త డ్రామా అని కొట్టిపారేశారు.


