
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. భారత్ కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్ చేసిన పుతిన్.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతిచెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పుతిన్,.
ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందుకు తీసుకురావాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు స్సష్టం చేశారు
ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తాం..
ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని రెండురోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.