సుదీర్ఘ ఎడబాటూ మానసిక హింసే | Prolonged Marital Separation Can Constitute Mental Cruelty | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ ఎడబాటూ మానసిక హింసే

Jun 4 2026 4:26 AM | Updated on Jun 4 2026 4:26 AM

Prolonged Marital Separation Can Constitute Mental Cruelty

దాంపత్య హక్కుల నిరాకరణ విడాకులకు కారణమే

కాగితాలకే పరిమితమైన బంధాన్ని సాగదీయలేం

భార్య అప్పీలు కొట్టివేసిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: భార్యాభర్తలు సుదీర్ఘకాలం పాటు ఎవరికి వారు విడిగా జీవిస్తూ వివాహ బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోవడాన్ని మానసి క క్రూరత్వంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంపత్య హక్కుల నిరాకరణ విడాకులకు స్పష్టమైన కారణమని తేల్చిచెప్పింది. రాజస్థాన్‌కు చెందిన డాక్టర్‌ దంపతుల విడాకుల కేసులో జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ ఏజీ మసీహ్‌ ల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

పెళ్లైన కొద్దిరోజులకే భార్య శారీరక సాన్నిహిత్యానికి దూరంగా ఉంటోందని, ఇది మానసిక హింసేనంటూ భర్త 2009లో విడాకులకు దరఖాస్తు చేశారు. ఈ కేసులో హైకోర్టు విడాకులు మంజూరు చేయగా, వివాహ బంధాన్ని కొనసాగించేందుకు సిద్ధమంటూ భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

వీరికి పిల్లలు లేకపోగా, 15 ఏళ్లుగా విడివిడిగానే ఉంటున్నారని, గతేడాది సుప్రీంకోర్టు సూచనతో జరిగిన మధ్యవర్తిత్వం విఫలమైందని వాదనల సందర్భంగా ఇరువర్గాల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దంపతులు సుదీర్ఘకాలం పాటు విడిగా జీవించడం, రాజీకి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం హిందూ వివాహ చట్టం ప్రకారం మానసిక హింస కిందకే వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

 సహేతుక కారణం లేకుండా దాంపత్య హక్కులను తిరస్కరించడం విడాకులకు బలమైన కారణమని పేర్కొంది. ఏళ్ల తరబడి విడిగా ఉంటున్న దంపతులను కలిసి ఉండాలని బలవంతం చేయడం వారి పట్ల క్రూరత్వమే అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. కేవలం కాగితాలకే పరిమితమైన వివాహ బంధాలను నిర్జీవంగా సాగదీయడం కంటే చట్టబద్ధంగా తెంచేయడమే ఇరువురికి, సమాజానికి శ్రేయస్కరమ ని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో తేల్చిచె ప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ద్వారా సంక్రమించిన విశేషాధికారాలను ఉపయోగించి ఈ వివాహ బంధాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భర్తకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, భార్య అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement