
హొసకోటె ఆహార ప్రియులకు పోలీసుల షాక్
ట్రాఫిక్, గొడవల కారణంగా వేళల మార్పు
కర్ణాటక: బెంగళూరు వాసులతో పాటు టూరిస్టులు మెచ్చిన ఫుడ్ స్పాట్ అంటే హొసకోటె కూడా ఒకటి. ఇందుకు కారణం అక్కడ లభించే మటన్, చికెన్ బిర్యానీ. తెల్లవారుజామున 4 ఏఎం బిర్యానీగా చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఇది పొద్దున్నే తినడం ఆరోగ్యానికి మంచిదా, కాదా అనే ఆలోచన ఉండదు. ఇకపై 4 ఏఎం బిర్యానీ దొరకదు. బెంగళూరు నుంచి 30 కి.మీ.ల దూరంలో ఉండే హొసకోటె గత కొన్నేళ్లుగా వేకువజాము బిర్యానీ వల్ల పేరుగాంచింది. చాలా మంది ఉదయాన్నే జాలీరైడ్‌కు వెళ్లి బిర్యానీ తిని రావడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. కుప్పలుగా క్యూలో నిలబడి తినే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బిర్యానీ తింటూ సెల్ఫీలు, వీడియోలు తీసి ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో పోస్టు చేయడం ట్రెండింగ్‌గా మారింది.
అన్నీ సమస్యలే.. అందుకే
ఈ వ్యాపారానికి స్థానిక పోలీసులు షాక్ ఇచ్చారు. ఇకపై తెల్లవారుజామున 4 గంటలకు బిర్యానీ అమ్మరాదు అని హోటళ్లవారిని హెచ్చరించారు.రెండు గంటలు లేటుగా 6 గంటలకు బిర్యానీ అమ్మకాలు షురూ చేయమని వారం నుంచి ఆదేశించారు.
కారణాలపై పోలీసు అధికారులు స్పందిస్తూ 4 గంటలకే బిర్యానీ కోసం పొడవైన క్యూలు ఏర్పడుతున్నాయి. దీంతో తోపులాట, గొడవలు జరుగుతున్నాయి.
రోడ్ల పక్కన బైక్‌లు, కార్లతో నిండిపోతోంది. బిర్యానీ తినాలనే ఆతృతతో రాత్రి 12 గంటల నుంచే బయల్దేరుతుంటారు. కొందరు మద్యం మత్తులో, గంజాయి మత్తులో వస్తుంటారు.
తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇంకా అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకే వేళను మార్చాం అని తెలిపారు.
దీంతో హోటళ్లవారు అయిష్టంగానే వేళలను మార్చారు.