సాక్షి,న్యూఢిల్లీ: మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి (యూఎన్), ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన NDTV వరల్డ్ సమ్మిట్‌లో కీలక ప్రసంగం చేసిన ఆయన.. ప్రస్తుత ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో పాత అంతర్జాతీయ వ్యవస్థలు వెనుకబడుతున్నాయని పేర్కొన్నారు.
వాణిజ్యం, సాంకేతికత, కొత్త ఆర్థిక శక్తుల ఆవిర్భావంతో ప్రపంచ క్రమం వేగంగా మారుతోందని మోదీ తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ శాంతి, సహకారం కోసం ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి గతంలో కీలక పాత్ర పోషించిందని, అయితే నేటి సంక్లిష్ట సవాళ్లకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని చెప్పారు.
గ్లోబల్ సౌత్‌కు మరింత ప్రాతినిధ్యం
ప్రపంచ వాస్తవాలు మారుతున్నప్పుడు నిర్ణయాలు తీసుకునే విధానాలు కూడా మారాలని మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాత్మక ప్రక్రియల్లో ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని పిలుపునిచ్చారు. సంక్షోభ సమయాల్లోనూ అంతర్జాతీయ సహకారం కొనసాగాలని స్పష్టం చేశారు.
ఇదే అంశంపై గతంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా స్పందించారు. 51 సభ్య దేశాలతో ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం దాదాపు నాలుగు రెట్లు విస్తరించిందని, సభ్యత్వం పెరిగినప్పటికీ పాత నిర్వహణ వ్యవస్థను కొనసాగించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఐరాస సంస్కరణలను కొందరు అడ్డుకుంటున్నారని కూడా విమర్శించారు.
ఇదీ చదవండి: పాక్‌తో మంచి సంబంధాలే కోరుకుంటున్నాం.. కానీ.. జైశంకర్


