కాంగ్రెస్‌ను ఒంటరి చేసే వ్యూహమిదేనా? బీజేపీ కొత్త రాజకీయమేంటి? | BJP Strategy Can It Split Opposition Unity and Isolate Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను ఒంటరి చేసే వ్యూహమిదేనా? బీజేపీ కొత్త రాజకీయమేంటి?

Oct 20 2026 11:59 PM | Updated on Oct 20 2026 11:59 PM

BJP Strategy Can It Split Opposition Unity and Isolate Congress

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్‌ను ఇతర విపక్ష పార్టీల నుంచి వేరు చేయవచ్చా? ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా విపక్షాలు ప్రదర్శిస్తున్న ఐక్యతను దెబ్బతీయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ అంశాన్ని ఉపయోగించుకోనుందా? 

ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు వ్యాఖ్యలు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేవనెత్తిన అభ్యంతరాలు ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. పునర్విభజన బిల్లులపై కొందరు విపక్ష పార్టీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరపడం కాంగ్రెస్‌కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

మహిళలకు చట్టసభల్లో 2026 ఏప్రిల్‌లో  33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, 2029 నుంచి వాటిని అమలు చేయడం, లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కు పెంచడం లక్ష్యంగా కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే, ఆ బిల్లుకు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించలేదు. ఓటింగ్‌లో 298 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఆ సమయంలో ఓటు వేసిన 528 మంది సభ్యుల్లో కనీసం 352 మంది మద్దతు అవసరమైంది.

ఆగస్టు 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే, అక్టోబర్‌ 20 నాటికి సమావేశాలను అధికారికంగా ముగిస్తూ రాష్ట్రపతి ప్రకటన వెలువడలేదు. దీంతో స్వల్ప వ్యవధితో పార్లమెంటును తిరిగి సమావేశపరిచి బిల్లులను ముందుకు తీసుకురావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఖర్గే లేఖలు.. రిజిజు ఎదురుదాడి 
కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అంశంపై నాలుగు లేఖలు రాశారు. నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఏప్రిల్‌ 11న తొలిసారి కోరినట్లు ఆయన తెలిపారు. జులై 16, ఆగస్టు 27 తేదీల్లోనూ ఇదే విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌ 16న మరోసారి లేఖ రాస్తూ, ప్రధాన రాజ్యాంగ సంస్కరణలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

దీనికి కిరణ్‌ రిజిజు ఘాటుగా స్పందించారు. చర్చల కోసం కాంగ్రెస్‌ పదేపదే కోరినా, ఆ పార్టీ తేదీలను ఇవ్వలేదని తెలిపారు. వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించడంలో జాప్యం జరిగిందన్న ఖర్గే అభ్యంతరాన్నీ రిజిజు తోసిపుచ్చారు. నిరవధిక వాయిదా తర్వాత సభను ఎన్ని రోజుల్లోగా అధికారికంగా ముగించాలనే నిర్దిష్ట రాజ్యాంగ గడువు లేదని పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్‌పై ఐక్యత.. పునర్విభజనపై భిన్నాభిప్రాయాలు
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల్లో తొలగించిన పేర్లపై చర్యలు తీసుకోవాలని అవి డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలతో పాటు పలు పౌర సమాజ సంస్థలూ పాల్గొంటున్నాయి. సాధారణంగా ఎన్డీఏ, ఇండియా కూటములకు సమాన దూరంలో ఉండే బిజూ జనతాదళ్‌ సైతం ఢిల్లీలో జరిగిన ఓ నిరసనకు మద్దతు తెలిపింది.

అయితే, ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కాంగ్రెస్‌తో ఒకే వైఖరిని కొనసాగిస్తాయా అన్నది ప్రశ్నగా మారింది. పునర్విభజనతో రాష్ట్రాల ప్రాతినిధ్యం మారదని, లోక్‌సభ స్థానాలను అన్ని రాష్ట్రాల్లో 50 శాతం చొప్పున పెంచుతామని బీజేపీ ప్రాంతీయ పార్టీలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్లను ఈ ప్రతిపాదనతో ముడిపెట్టడం కూడా పార్టీలకు రాజకీయంగా ఒత్తిడితో పాటు అవకాశాన్ని కల్పిస్తోంది.

కాంగ్రెస్‌ ముందున్న సవాలు
పునర్విభజన బిల్లుకు కొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తే, ఎస్‌ఐఆర్‌పై విపక్షాల ఉమ్మడి పోరాటంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది కీలకం. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే విచారిస్తోంది. మరోవైపు, 14 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల పేర్ల నమోదు ప్రక్రియతో పాటు ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌)ను ఎన్నికల సంఘం ప్రారంభించింది. అందువల్ల ఎస్‌ఐఆర్‌ ఒక్కటే విపక్షాలను దీర్ఘకాలం ఐక్యంగా ఉంచలేకపోవచ్చు. కాంగ్రెస్‌ తన మిత్రపక్షాలతో ఐక్యతను కొనసాగించేందుకు ఇతర ఉమ్మడి అంశాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement