‘ప్రజాస్వామ్యంలో బ్యాలెట్లు కావాలి.. బుల్లెట్లు కాదు’ | YSRCP Leaders Meet SEC Over Local Body Nominations Issues | Sakshi
Sakshi News home page

‘ప్రజాస్వామ్యంలో బ్యాలెట్లు కావాలి.. బుల్లెట్లు కాదు’

Oct 20 2026 7:20 PM | Updated on Oct 20 2026 7:20 PM

YSRCP Leaders Meet SEC Over Local Body Nominations Issues

విజయవాడ: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా చ‌ట్టానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించిన కొంద‌రు పోలీసు అధికారుల తీరుపై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో జాయింట్ డైరెక్టర్ రామారావుకు వైఎస్సార్‌సీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. అనంత‌రం అక్క‌డే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు మీడియాతో మాట్లాడారు.

లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ 59 మంది పోలీసు అధికారులపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాం. ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించాలి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై వందల సంఖ్యలో కేసులు.. అసలు ఎవరిపై, ఎప్పుడు, ఎక్కడ కేసులు పెట్టారో పోలీసులకే తెలియదా?, కేసుల వివరాలు అడిగితే చెప్పరు. కేసులు లేవన్న సర్టిఫికెట్ అడిగినా ఇవ్వరు.. ఇదెక్కడి న్యాయం?, నామినేషన్‌కు పోలీసు సర్టిఫికెట్ తప్పనిసరి కాదని ఎస్ఈసీ జాయింట్ డైరెక్టర్ స్పష్టం చేశారు.. ఈ విషయంపై కింది స్థాయి అధికారులకు సర్క్యులర్ ఇవ్వాలి. 

హైకోర్టు ఆదేశించినా జూలై 15 వరకు ఓటర్ల జాబితా ఇవ్వలేదు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి. కుప్పంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి విజయ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశారు.. ఇదేనా మీ ప్రజాస్వామ్యం?, మంగళగిరిలో దాసరి వీరయ్యను పీడీ యాక్ట్‌తో అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపారు.. దుగ్గిరాలలో వైఎస్సార్‌సీపీ గెలుస్తుందనే భయంతోనే ఈ చర్యలు!. దళిత నాయకుడు వీరయ్యను ఎన్నికలకు దూరం చేయాలని చూస్తున్నారు.. అరెస్టులతో వైఎస్సార్‌సీపీని పోటీ నుంచి తప్పించలేరు. 

కుప్పంలో మా ప్రభుత్వ హయాంలో టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నామా? బెదిరించామా? ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి.. ప్రజల ఓట్లతోనే గెలిచాం. బ్యాలెట్లంటే భయమెందుకు? ప్రజాస్వామ్యంలో బ్యాలెట్లు కావాలి.. బుల్లెట్లు కాదు. అక్రమ అరెస్టులు, దాడులు, కేసులతో ప్రజల తీర్పును మార్చలేరు.. ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనుకోవడం మూర్ఖత్వం. అభ్యర్థులపై కేసులు, పోలీసుల అక్రమాలపై ఎస్ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలి.. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి!

టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. ‘ దసరా పండుగ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎస్ఈసీ కార్యాలయం చుట్టూ తిరిగే దుస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారు.  చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలి. మేము నామినేషన్లు వేస్తాం, మీరు వేయండి. ఐదుసార్లు సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా ప్రజలకు సేవ చేసిన కుటుంబానికి చెందిన దాసరి వీరయ్యపై పీడీ యాక్ట్ పెట్టడం దారుణం.

లోకేశ్‌గారూ.. దళిత నాయకుడు వీరయ్యపై అధికార అహంకారాన్ని చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో గెలవాలి, అరెస్టులతో కాదు. 
వైఎస్సార్‌సీపీని అణచివేయడానికి పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు.. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు.  చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసు అధికారులు, రిటర్నింగ్ అధికారులు, కలెక్టర్ల వివరాలను ఎస్ఈసీకి అందజేశాం.. అక్రమాలకు పాల్పడినవారిని వదిలిపెట్టం!

అవసరమైతే ఢిల్లీకి వెళ్లి మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం.. మా పోరాటం ఆగదు. వైఎస్‌  జగన్‌ కార్యకర్తల కోసం ఎస్ఈసీని, గవర్నర్‌ను కలుస్తున్నారు.. కార్యకర్తల హక్కుల పరిరక్షణే మా ప్రాధాన్యం. రాయలసీమలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ కక్షలు పెంచుతున్నారు.. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య చీలికలు తీసుకురావద్దు.  ఎన్నికల్లో పోటీ చేయకుండా నాయకులను జైళ్లలో పెడితేవైఎస్సార్‌సీపీ వెనక్కి తగ్గదు.. ప్రజలు మరింత బలంగా మద్దతుగా నిలుస్తారు. అక్రమ అరెస్టులు, దాడులు, బెదిరింపులతో ఏదో సాధించాలనుకోవడం తప్పు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజల తీర్పే అంతిమం. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై న్యాయపోరాటం కొనసాగిస్తాం.. వైఎస్ జగన్ నాయకత్వంలో కార్యకర్తల హక్కుల కోసం చివరివరకు పోరాడతాం’ అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:  ఎన్నికల అధికారికి ఆర్కే రోజా ఫిర్యాదు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement