పాక్‌తో మంచి సంబంధాలే కోరుకుంటున్నాం.. కానీ.. జైశంకర్‌ | jaishankar at ndtv world summit want good relationship with pak | Sakshi
Sakshi News home page

పాక్‌తో మంచి సంబంధాలే కోరుకుంటున్నాం.. కానీ.. జైశంకర్‌

Oct 22 2026 10:21 PM | Updated on Oct 22 2026 10:31 PM

jaishankar at ndtv world summit want good relationship with pak

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాయాది దేశం పాకిస్థాన్‌తో భారత్‌ మంచి సంబంధాలనే కోరుకుంటుందన్నారు. అయితే ఉగ్రవాదాన్ని మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనే దృఢ సంకల్పం, స్పష్టమైన ఆలోచనా విధానం కనుక దేశానికి లేకుండా.. ఆ పని మరెవరో వచ్చి చేస్తారని ఆశించడం సరైంది కాదన్నారు.

ఈ రోజు (గురువారం) ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2026లో లో విదేశాంగ మంత్రి జైశంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఉగ్రవాదంపై భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అమెరికా, ఇతర దేశాలు భారత్ సమస్యలను అర్థం చేసుకునే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఒక దేశం తనపై జరిగే ఉగ్రదాడులకు ఎలా స్పందిస్తుందన్నదానినే ప్రపంచం గమనిస్తుంది. ఆ విషయంలో భారత్ ఇప్పటికే తన చర్యల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది అని అన్నారు.

అదే విధంగా అమెరికా- భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుతూ.. “వాషింగ్టన్ మన సమస్యను అర్థం చేసుకుందా లేదా అన్నదే అసలు విషయం కాదు. అమెరికా మన సమస్యను అంత బాగా అర్థం చేసుకుని ఉంటే, 2008లో ముంబైపై 26/11 ఉగ్రదాడులు జరిగినప్పుడు మనం ఎందుకు చర్యలు తీసుకోలేదు? మనం చర్యలు తీసుకున్నప్పుడు, అమెరికా అర్థం చేసుకుందని కాదు.. మన సమస్యను మనమే అర్థం చేసుకున్నాం కాబట్టే స్పందించాం” అని  స్పష్టం చేశారు.

ఇతర దేశాలు ఉగ్రవాద సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆశించే ముందు, మనమే ఆ సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో స్పష్టత, దృఢ సంకల్పం ఉండాలని పేర్కొన్నారు. “ఉగ్రవాదంపై తిరిగి పోరాడాలనే నమ్మకం, దృఢ సంకల్పం మీకు లేకపోతే, ఆ పని మరెవరైనా మీ తరఫున చేస్తారని అనుకోవద్దు” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదంపై భారత్ విధానంలో కాలక్రమేణా మార్పు వచ్చిందని జైశంకర్ వివరించారు. 2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ వైమానిక దాడులు, గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఈ మార్పునకు నిదర్శనాలని పేర్కొన్నారు. సరిహద్దుల అవతలి నుంచి ఉగ్రవాదం కొనసాగితే, దాన్ని సాధారణ పరిణామంగా తీసుకుని వ్యవహరించే రోజులు ముగిశాయని ఆయన స్పష్టం చేశారు.

గతంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత కొంతకాలం గడిచాక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని భావించి, మళ్లీ పాకిస్థాన్‌తో చర్చలు ప్రారంభించే విధానం ఉండేదని జైశంకర్ గుర్తుచేశారు. అయితే ఇప్పుడు భారత్ వైఖరిలో మార్పు వచ్చిందని, ఉగ్రవాదం కొనసాగుతున్నంత కాలం పాకిస్థాన్‌తో యథావిధిగా వ్యవహారాలు కొనసాగించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

“ఉగ్రవాదం కొనసాగితే, ఇకపై అంతా మామూలుగానే సాగిపోతుందని అనుకోవద్దు. కొంతకాలం విరామం తీసుకుని, ఆ తర్వాత చాలా రోజులు గడిచిపోయాయని భావించి మళ్లీ పాకిస్థాన్‌తో చర్చలు ప్రారంభించే పాత పద్ధతి ఇక ఉండకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్బంగా  26/11 ముంబై ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ, భారత్‌కు జరిగిన నష్టం ఎంత తీవ్రమైనదో, అలాంటి దాడులకు ప్రతిస్పందించడం ఎంత అవసరమో ఆ ఘటన గుర్తుచేస్తుందని జైశంకర్ అన్నారు.


ఇదీ చదవండి: ఐక్యరాజ్యసమితిలో సుధామూర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement