PM Modi Review Meeting On Omicron Over Night Curfew, Social Gatherings - Sakshi
Sakshi News home page

Omicron: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. రాష్ట్రాలకు, కేంద్రం కీలక ఆదేశాలు

Published Thu, Dec 23 2021 7:30 PM

PM Narendra Modi Review Meeting On Omicron And Coronavirus - Sakshi

న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కోవిడ్‌ కాలంలో అనుసరించాల్సిన విధానాలు (కోవిడ్‌ అప్రాప్రియేట్‌ బిహేవియర్‌– సీఏబీ) తప్పక పాటించాలని ప్రధాని నరేం‍ద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు.

ఒమిక్రాన్‌ కల్లోల నేపథ్యంలో కరోనా పరిస్థితులపై ఆయన గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అందరం అప్రమత్తంగా, జాగరుకతతో ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ, ఆరోగ్య వసతుల కల్పన, ఔషధాలు, ఆక్సిజన్‌ లభ్యత, వెంటిలేటర్లు, ఆస్పత్రి బెడ్స్‌ లభ్యత, మానవ వనరులు, టీకా కార్యక్రమ పురోగతి తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వల్ల తలెత్తుతున్న పరిస్థితులను, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి, అధిక కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలు, పాజిటివిటీ అధికంగా ఉన్న జిల్లాల సమాచారాన్ని ప్రధాని ముందుంచారు. నవంబర్‌ 25 నుంచి తీసుకున్న చర్యలను, అంతర్జాతీయ విమానప్రయాణికుల నూతన నిబంధనలు, రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశాల సారాన్ని ప్రధానికి వివరించారు. పర్యవేక్షణ అనంతరం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ తగిన సహాయం అందించాలని కేంద్ర అధికారులను మోదీ ఆదేశించారు.  
చదవండి: దేశం ఓ మైలు రాయిని అధిగమించింది! 60% జనాభాకు..

పీఎం ఆదేశాలివే..
► కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాలి.
► జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలి.
► రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్‌ సదుపాయాలు, సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
► ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలి.  
► టెలిమెడిసిన్, టెలి కన్సల్టేషన్‌ వంటి ఐటీ సాంకేతికతలను ఉపయోగించుకోవాలి.
► కేసుల సత్వర గుర్తింపుతో పాటు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలి.
► కాంటాక్ట్‌ ట్రాకింగ్‌ సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా వ్యాప్తిని అరికట్టే చర్యలపై శ్రద్ధవహించాలి.
► తక్కువ టీకా రేటు, ఎక్కువ కేసులున్న ప్రాంతాలకు బృందాలను పంపాలి.

కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాలి. జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలి. రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్‌ సరఫరా యంత్రాంగం ఉండేలా, అవన్నీ సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలి.    
– ప్రధాని మోదీ

Advertisement
Advertisement