
పంజాబ్: అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ప్రధాని భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్‌లో ఎయిర్‌ఫోర్స్ కీలక పాత్రపై మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ముచ్చటించి వారిని అభినందించారు. పాక్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించారంటూ ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా నిన్న (సోమవారం) రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పంజాబ్‌లో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
పాక్‌పై మన సైనిక విజయాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నట్టు మోదీ నిన్న(సోమవారం) తన ప్రసంగంలో ప్రకటించారు. ఉగ్ర పోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడింది. విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుందన్నారు. కానీ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది.
..పాక్ డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడివక్కడ నేలకూల్చింది. మనం అంతటితో ఆగలేదు. వాళ్లు సరిహద్దులపై దాడి చేస్తే నేరుగా పాక్ గుండెకాయకే గురిపెట్టాం. ప్రధాన నగరాల్లోని వాళ్ల కీలక సైనిక, వైమానిక స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశాం. పాక్ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం. ఆ క్రమంలో మన బలగాలు అంతులేని సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఏకకాలంలో అద్భుత రీతిలో ప్రదర్శించాయి. మన దేశీయ ఆయుధ వ్యవస్థ తాలూకు పాటవాన్ని పూర్తిస్థాయిలో రుచిచూపాయి’’ అని ప్రధాని అన్నారు.