ప్రధాని పర్యటన వేళ.. గుజరాత్‌లో మతఘర్షణల అలజడి!

PM Modi Gujarat visit: Communal clashes erupt in Bhuj - Sakshi

గాంధీనగర్‌: ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించే వేళ.. మత ఘర్షణల అలజడి చెలరేగింది. కచ్‌ జిల్లా భుజ్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యతో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అల్లర్లకు, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ప్రాంతంలోనే షెడ్యూల్‌ ప్రకారం..  ప్రధాని మోదీ శనివారం ముందుగా పర్యటించాల్సి ఉంది.

భుజ్‌ మాదాపూర్‌లో శుక్రవారం సాయంత్రం స్థానిక పాల వ్యాపారం చేసే ఓ వ్యక్తిని కత్తితో హత్య చేశారు. ఈ వార్త దావానంలా వ్యాపించగా.. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో దుకాణాలతో పాటు ఓ మసీదును ధ్వంసం చేశారు. 

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. శాంతిభద్రతలు దెబ్బతినకుండా ఉండేందుకు భారీగా మోహరించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు.. దర్యాప్తులు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు ప్రధాని మోదీ పర్యటిస్తారు. 2001 భూకంప సమయంలో మరణించిన బాధితులకు నివాళిగా, ఆ సమయంలో ప్రజలు కనబర్చిన మనోధైర్యానికి గుర్తుగా భుజ్‌లో 470 ఎకరాల్లో ‘స్మృతి వన్‌’ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో మత ఘర్షణలు తలెత్తడం భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. 

అలాగే సబర్మతి తీరం వద్ద ఖాదీ ఉత్సవ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించి.. ప్రసంగిస్తారు. ఇక ఆదివారం గాంధీనగర్‌లో సుజుకీ కంపెనీ 40 ఏళ్ల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడే రూ.7,300 కోట్లతో సుజుకీ సంస్థ చేపడుతున్న ఈవీ బ్యాటరీ తయారీ కంపెనీకి శంకుస్థాపన చేస్తారు. ఈ  మేరకు ప్రధాని కార్యాలయం ప్రధాని పర్యటన షెడ్యూల్‌ ప్రకటించింది.

ఇదీ చదవండి: గులాం నబీ ఆజాద్‌ కోసం మోదీ కన్నీరు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top