సాగు సమస్యలకు సాంకేతిక పరిష్కారం 

PM Modi Dedicates 35 Crop Varieties With Special Traits To Nation - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం 

35 నూతన వంగడాల ఆవిష్కరణ 

న్యూఢిల్లీ: సాగు రంగంలో సమస్యలను సాంకేతికతతో అధిగమించేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా సమాఖ్య(ఐసీఏఆర్‌) అభివృద్ధి చేసిన వంగడాలు ప్రధాని మంగళవారం ఆవిష్కరించారు. రాయ్‌పూర్‌లో నిర్మించిన జాతీయ బయోటిక్‌ స్ట్రెస్‌ టాలరెన్స్‌ సంస్థ నూతన భవనాన్ని  ప్రారంభించారు. నాలుగు యూనివర్సిటీలకు గ్రీన్‌ క్యాంపస్‌ అవార్డులిచ్చారు. ‘సైంటిస్టులు 1300 రకాలకు పైగా విత్తన వెరైటీలను అభివృద్ధి చేశారు.

ఈ రోజు మరో 35 వెరైటీలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ వంగడాలు వాతావరణ మార్పులు, పోషకాహార లోపాల సవాళ్లను పరిష్కారిస్తాయి’ అని మోదీ అన్నారు. రైతులు ఎదుర్కొనే భిన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త రకాలను సైంటిస్టులు రూపొందించారు.  కరవు తదితర కఠిన వాతావరణ పరిస్థితులను, వివిధ రకాల వ్యాధులను తట్టుకునే విధంగా వీటిని అభివృద్ధి చేశారని ప్రధాని చెప్పారు.  

అధిక పోషక విలువలున్న వరి, గోదుమ, మొక్కజొన్న, సోయాబీన్‌ తదితర పంట రకాలు కొత్తగా రూపొందించినవాటిలో ఉన్నాయి. దేశ రైతాంగంలో 86 శాతం మంది సన్నకారు రైతులేనని, వారి ఆదాయాన్ని పెంచడంపై ప్రధాని ఎల్లప్పుడూ శ్రద్ధ పెడుతుంటారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌ చెప్పారు.  సాగు రంగానికే కాకుండా మొత్తం పర్యావరణానికి వాతావరణ మార్పు(శీతోష్ణస్థితి మార్పు) అతిపెద్ద సవాలుగా మారిందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాలన్నారు. దీనివల్ల సాగు, అనుబంధరంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయన్నారు.

హైదరాబాద్‌ నుంచి 5 
మోదీ ఆవిష్కరించిన కొత్త వంగడాల్లో ఐదు హైదరాబాద్‌లోని భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌లో అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌కే చెందిన సీసీఎంబీ, పీజేటీఎస్‌ఏయూ ఈ వంగడాల అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. పంటకాలంతో పాటు నీటి అవసరం తక్కువగా ఉండే ‘డీఆర్‌ఆర్‌ ధన్‌ 57’, మధ్యమస్థాయి పలుచటి గింజ కలిగి, అగ్గితెగులును, ఉప్పునీటిని తట్టుకోగల ‘డీఆర్‌ఆర్‌ ధన్‌ 58’, పొడవుతోపాటు పలుచటి గింజలు కలిగి అగ్గితెగులును తట్టుకోగల ‘డీఆర్‌ఆర్‌ ధన్‌ 59’, ఫాస్పరస్‌ తక్కువగా ఉన్న నేలల్లోనూ పండగల, అగ్గితెగులును తట్టుకోగల ‘డీఆర్‌ఆర్‌ ధన్‌ 60’... అగ్గితెగులు, బ్లాస్ట్‌ రోగాన్ని తట్టుకోగల ‘డీఆర్‌ఆర్‌ ధన్‌ 62’ వంగడాలను ప్రధాని మంగళవారం కొన్ని ఇతర వంగడాలతో కలిపి విడుదల చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top