
దేశ రాజధాని శివారు ప్రాంతమైన ఘాజియాబాద్‌లో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఉనికే లేని ఓ దేశానికి ఉత్తుత్తి రాయబార కార్యాలయాన్ని సృష్టించిన ఓ మోసగాడు.. ఉద్యోగాలు, ఇతర దందాల పేరుతో లక్షలు గడించాడు. ఆ కేటుగాడి మోసానికి పోలీసులకే షాక్ కొట్టినంత పనైంది.
హర్షవర్ధన్ జైన్.. ఘజియాబాద్‌లో విలాసవంతమైన రెండతస్తుల భవనం, లగ్జరీ కార్లతో రాయబారిగా బిల్డప్ ఇస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. తాను ‘వెస్టార్కిటికా’(Westarctica) దేశపు రాయబారినని చెబుతూ దందాలు చేశాడు. జనాల్ని బాగా నమ్మించడానికి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లతో ఉన్న కార్లలో తిరగసాగాడు. వీటికి తోడు.. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాజకీయ ప్రముఖులతో దిగిన ఫొటోలను(మార్ఫింగ్) ఆ ఆఫీస్‌లో ఉంచాడు.
జూలై 22న ఉత్తరప్రదేశ్‌లోని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఈ నకిలీ రాయబార కార్యాలయం గుర్తించింది. దీంతో ఆ భవనంపై దాడులు నిర్వహించగా.. అసలు విషయం బయపడింది. దీంతో హర్షవర్ధన్ జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.44 లక్షల నగదు, విదేశీ కరెన్సీతో పాటు.. దౌత్య నంబర్ ప్లేట్లు ఉన్న 4 లగ్జరీ కార్లు, 12 మైక్రోనేషన్ల దౌత్య పాస్‌పోర్ట్‌లు, విదేశాంగ మంత్రిత్వ శాఖ స్టాంపులున్న పత్రాలు, 34 దేశాల స్టాంపులు, 18 దౌత్య నంబర్ ప్లేట్‌లను స్వాధీనం చేసుకున్నారు. హర్షవర్ధన్ జైన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరో వైపు విదేశీ ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నాడని.. నకిలీ డిప్లొమాటిక్ పత్రాలు, ఫోటో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2011లో చట్ట విరుద్ధంగా శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నందుకు అతడిపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. హర్షవర్ధన్ జైన్ కార్యకలాపాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
కొసమెరుపు..
వెస్టార్కిటికా నిజంగా దేశమా?.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అమెరికా నేవీ అధికారి ట్రావిస్ మెక్‌హెన్రీ 2001లో ‘వెస్టార్కిటికా’ను స్థాపించాడు. మంచు ఖండం అంటార్కిటికాలో 6.2 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాడు. ఇదొక మైక్రోనేషన్. అయితే లీగల్‌గా దీనిని ఏ దేశం గుర్తించలేదు. అలా దీనికి ఉనికి లేకుండా పోయింది. ఇలాంటి పేరును మన ఘరానా మోసగాడు వాడేసుకుని.. చివరకు కటకటాల పాలయ్యాడు.