
పథకం ప్రకారమే కాలేజీలో అత్యాచారం
ప్రధాన నిందితుడు మోనోజిత్‌కు నేర చరిత్ర
కోల్‌కతా గ్యాంగ్ రేప్ ఘటనలో
దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడి
కోల్‌కతా: కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా, సహ నిందితులు గురించి దిగ్భ్రాంతికర విషయాలు సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయి. పెళ్లి ప్రతిపాదనను నిరాకరించిందనే అక్కసుతో బాధితురాలిని కాలేజీలో జాయినయిన మొదటి రోజు నుంచే వేధించాలని పథకం వేసినట్లు తేలింది. కాగా, ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి బదలాయించాలంటూ సోమవారం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఏడు పెండింగ్ కేసులు
మోనోజిత్ హిస్టరీ షీటర్, ఇతడిపై పలు లైంగిక వేధింపుల కేసులతోపాటు ఇతర నేరారోపణలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు సోమవారం తెలిపారు. ఇప్పటికే కనీసం ఏడు ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌లు ఇతడిపై కోల్‌కతాలోని పలు పోలీస్‌స్టేషన్లో నమోదై ఉన్నట్లు చెప్పారు. లా కాలేజీలో జాయిన 2013లోనే ఇతడు కాళీఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక యువకుడిని కత్తితో పొడిచినట్లు కేసు నమోదైంది. దీంతో, కాలేజీ ఇతడిని బహిష్కరించింది. అప్పటికే టీఎంసీ విద్యార్థి విభాగంలో నేతగా ఇతడు పలుకుబడి సంపాదించినట్లు కాలేజీ మాజీ విద్యార్థి ఒకరు తెలిపారు. 2016లో లా కాలేజీపై దాడి కేసులో ఇతడూ నిందితుడే. ఆ తర్వాత ఈ కేసును కొట్టివేశారని మరో మాజీ విద్యార్థి నేత చెప్పారు. 2017లో తిరిగి ఇదే కాలేజీలో ప్రవేశం పొందిన మోనోజిత్ 2022లో ఉత్తీర్ణుడయ్యే వరకు కొనసాగాడు. ఆ సమయంలో అతడు పలు విద్యార్థినులను కాలేజీ యూనియన్ ఆఫీస్‌లోనే వివిధ కారణాలతో వేధించేవాడని తెలిసింది. 2018లో ఇద్దరు విద్యార్థినులు ఇతడిపై వేధింపుల కేసు పెట్టారు. విచిత్రంగా, ఈ కేసులో పోలీసులు ఎవర్నీ అరెస్ట్ చేయలేదని స్థానిక మీడియా వ్యాఖ్యానించింది. రాజకీయ పలుకుబడితో మేనేజ్ ఇలాంటి వాటిని మోనోజిత్ చేసుకునేవాడని వ్యాఖ్యానించింది.
సహనిందితులదీ అదేబాట
ఈ నేరంలో మిశ్రాకు సహకరించిన, సహ నిందితులు ప్రతిమ్ ముఖర్జీ, జయిద్ అహ్మద్‌కు గతంలో మహిళలను వేధించిన రికార్డు కూడా ఉందని వెల్లడైంది. ‘ముందుగా వేసిన పథకం ప్రకారమే జూన్ 25వ తేదీన లా కాలేజీలో బాధితురాలిపై మోనోజిత్ దాడికి, అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను చిత్ర హింసలకు గురి చేయాలని కూడా వీరు కుట్ర పన్నారు’అని ఓ అధికారి వివరించారు. గతంలో పలువురు విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన ఈ త్రయం వాటిని సెల్‌ఫోన్లలో చిత్రీకరించి, బాధితులకు వాటిని చూపి బ్లాక్‌మెయిల్ చేసేవారని ఆ అధికారి తెలిపారు. జూన్ 25వ తేదీన గ్యాంగ్ రేప్ ఘటన వీడియోను సైతం వీరు ఇతరులకు షేర్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, ఎవరికి షేర్ చేశారనే విషయాన్ని ఆరా తీస్తున్నామన్నారు. నిందితుల ఇళ్లలోనూ ఆదివారం సోదాలు జరిపామన్నారు. బాధిత 24 ఏళ్ల విద్యారి్థనిపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షలో వెల్లడైందని పోలీసు అధికారి వివరించారు. ఘటన జరిగిన సమయంలో కాలేజీలో ఉన్న 25 మంది విద్యార్థులను గుర్తించామని, వారి నుంచీ వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.
పోటాపోటీ నిరసనలు..
సౌత్ కలకత్తా లా కాలేజీ వద్ద బీజేపీ, అనుబంధ విద్యార్థి విభాగం బీజేవైఎం కార్యకర్తలను వామపక్ష పారీ్టలు, అనుబంధ విద్యార్థి సంఘాల కార్యకర్తలు చేపట్టిన పోటా పోటీ నిరసన కార్యక్రమాలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచి్చంది. ఈ నేపథ్యంలో బీఏ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంలకు సంబంధించిన అన్ని తరగతులను నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు ఘటన చోటుచేసుకున్న సౌత్ కలకత్తా లా కాలేజీ ప్రకటించింది. విద్యారి్థనిపై గ్యాంగ్‌రేప్ ఘటనపై దర్యాప్తులో భాగంగా కాలేజీ ఒక గేటును, ఒక వాష్ రూంను, యూనియన్ రూం, గార్డు రూంను పోలీసులు సీజ్ చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. తరగతులను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.